Begin typing your search above and press return to search.

బాబును ఆ ఫీలింగ్ పీడిస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   15 April 2017 10:30 AM GMT
బాబును ఆ ఫీలింగ్ పీడిస్తోంద‌ట‌
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తన ప్రభుత్వ పనితీరుపై నిఘా సంస్థలు ఇస్తున్న నివేదికలతో సంతృప్తి చెందడం లేదా? ఇంకా క్షేత్రస్థాయి వాస్తవాల కోసం పరితపిస్తున్నారా? వేల కోట్లు ఖర్చుచేసి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు జనంలోకి వెళ్లడం లేదని భావిస్తున్నారా? అసలు జనం మదిలో తన పాలనపై ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా?.. కొద్దిరోజుల నుంచి బాబు కసరత్తు చేసి ఊపిరిపోస్తున్న సాంకేతిక వ్యవస్థలను చూస్తే ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.

మ‌రో రెండేళ్ల త‌ర్వాత‌ జరిగే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటినుంచే అప్రమత్తం అవుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే అనునిత్యం జనజీవనంతో ముడిపడి ఉండే పౌరసరఫరాలు - రెవిన్యూ - విద్యుత్ - పోలీసు - వైద్యం వంటి కీలక విభాగాల్లో సేవలు ఎలా ఉన్నాయనే అంశాన్ని నేరుగా పరిశీలించే సాంకేతిక వ్యవస్థను బాబు ఏర్పాటు చేయించారు. ఇటీవలే 25 ప్రభుత్వ శాఖల్లో కాల్‌ సెంటర్లుకు కసరత్తు పూర్తిచేశారు. వాటికి టోల్‌ ఫ్రీ నెంబర్ ఇచ్చి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు - సలహా సూచనలు తీసుకునే వినూత్న సమాచార వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు బాబు సిద్ధమవుతున్నారు. ఈ కాల్‌సెంటర్ వ్యవస్థ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. దానికోసం ఏర్పాటుచేసిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ జూన్ 1 నుంచి 750 మంది సిబ్బందితో పని ప్రారంభించనుంది. తాజాగా ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన కైజాలా సమాచార వ్యవస్థలో భాగంగా ‘కనెక్ట్ ఏపీ సీఎం’ యాప్‌ ను బాబు ఆవిష్కరించారు. దీన్ని ప్రజలంతా గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పనితీరు - సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న వైనం - ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా? లేదా?, స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య, తదితర ప్రశ్నలను రోజుకోవిధంగా ఆ యాప్‌ లో పొందుపరుస్తారు.

కాగా, యాప్ ద్వారా ప్రజలిచ్చే సమాధానాలు కేవలం చంద్రబాబు ఒక్కరికే తెలిసేలా సాంకేతిక వ్యవస్థ రూపొందించారు. బాబుకు నమ్మకస్తులైన అధికారుల బృందం దాన్ని నిరంతరం పర్యవేక్షించి, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటుంది. దీనిపై రోజువారీ సమీక్షలు జరుపుతారు. కైజాలా యాప్ ద్వారా వచ్చిన సమాచారంపై ఆయా విభాగాలను అప్రమత్తం చేయడం, సర్కారు శాఖల్లో అవినీతి ఉంటే ఏసిబీ - నిఘా వ్యవస్థలకు చేరవేయడం, మళ్లీ శాఖలవారీగా సమాచారాన్ని సంబంధిత మంత్రుల సమీక్ష సమావేశాల్లో ప్రస్తావించడం వంటి చర్యలతో అందరినీ అప్రమత్తం చేయడమే బాబు అసలు లక్ష్యమంటున్నారు. ఆ ఫలితాల ఆధారంగానే బాబు రాజకీయంగా తన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/