Begin typing your search above and press return to search.

సచివాలయ శంకుస్థాపన టీడీపీకి మాత్రమేనా?

By:  Tupaki Desk   |   17 Feb 2016 6:19 AM GMT
సచివాలయ శంకుస్థాపన టీడీపీకి మాత్రమేనా?
X
ఏపీ ప్రజల కలల రాజధాని అయిన అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి తొలి నిర్మాణం మొదలైంది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి సంబంధించి శుంకుస్థాపన కార్యక్రమం పూర్తి అయ్యింది.

బుధవారం ఉదయం పండితులు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్.. రాష్ట్ర మంత్రులు పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారపక్ష ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. టీడీపీ నేతలు పాల్గొన్నారు. అన్నీ బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమానికి విపక్ష నేతతో పాటు.. మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆహ్వానించారా? లేదా? అన్న అంశంపై స్పష్టత రావటం లేదు.

సాధారణంగా నిర్వహించే కార్యక్రమాల సంగతి వేరు.. ఏపీ రాజధానికి సంబంధించిన వ్యవహారాలు వేరన్న విషయాన్ని ఏపీ అధికారపక్షం గుర్తిస్తే మంచిది. అమరావతిలో నిర్మించే కీలకమైన కట్టడాలకు సంబంధించిన కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అన్నీ పార్టీల నేతల్ని పిలవటం.. వారిని కూడా భాగస్వామ్యం చేయటం బాగుంటుంది. అంతేకానీ.. కేవలం ఇలాంటి కార్యక్రమాలు కేవలం అధికారపార్టీ సభ్యులకు మాత్రమే పరిమితం కావటం సరికాదు.

ఈ విషయంలో ఏపీ సీఎం చొరవ తీసుకొని అఖిలపక్ష భేటీ వేసి సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా చంద్రబాబు వ్యవహరిస్తారో లేక.. తాను తన పార్టీ నేతలు మాత్రమే అమరావతి నిర్మాణంలో పాలు పంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారో చూడాలి.