Begin typing your search above and press return to search.

బాబుగారూ.. చిన్నోళ్లను చూసైనా ధైర్యం తెచ్చుకోరా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 5:30 PM GMT
బాబుగారూ.. చిన్నోళ్లను చూసైనా ధైర్యం తెచ్చుకోరా?
X
ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం చిన్నదేమీ కాదు. ప్రస్తుతానికి అదే రెండో అతిపెద్ద పార్టీ. భాజపాకు ప్రభుత్వాన్ని నడపగల పూర్తి మెజారిటీ ఉండవచ్చు గాక.. ఇవాళ కాకపోవచ్చు.. రేపైనా మిత్ర పక్షాల అవసరం రాకుండా ఉండదనే వారికి కూడా తెలుసు. ఈ ఎన్డీయే కూటమిలో 272 సీట్లు ఉన్న భాజపా తర్వాత.. మొన్నమొన్నటిదాకా రెండోస్థానం 18 సీట్లున్న శివసేనదే. ఇప్పుడు శివసేన ఎన్డీయే రాంరాం చెప్పి బయటకు వెళ్లిపోవడంతో.. 16 మంది ఎంపీలున్న తెలుగుదేశమే రెండో అతిపెద్ద పార్టీ అయింది. మరి అంతపెద్ద పార్టీ హోదా ఉండి కూడా.. భాజపాను గట్టిగా డిమాండ్ చేయడానికి ఎందుకు జంకుతోందో ప్రజలకు అర్థం కావడం లేదు. మా పరువు నిలబడేలా మీరు బడ్జెట్ కేటాయింపులు గనుక చేయకుంటే.. మా దారి మేం చూసుకుంటాం అనే వాక్యం తెలుగుదేశం అధినేత ఎందుకు చెప్పలేకపోతున్నారు.. అనేది పలువురిని వేధిస్తున్న సందేహం.

ఎన్డీయేలో పెద్దన్న భూమిక పోషిస్తున్న భాజపా ఒంటెత్తు పోకడలతో విసిగిపోయి.. శివసేన కొన్ని వారాల కిందటే గుడ్ బై చెప్పేసింది. బడ్జెట్ ద్రోహం తరువాత.. తెలుగుదేశం ఇంకా మీన మేషాలు లెక్కిస్తున్నది గానీ.. మరోవైపు శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీయే కు గుడ్ బై చెప్పేస్తాం అని హెచ్చరికలు జారీచేస్తోంది. ఇంతా కలిపి ఆ పార్టీకి ఉన్న లోక్ సభ సభ్యుల బలం కేవలం 4 మాత్రమే. నలుగురు సభ్యులున్న పార్టీనే భాజపా పోకడలతో విసిగిపోయి.. కటీఫ్ చెప్పడానికి తెగిస్తోంటే.. రెండో అతిపెద్ద పార్టీ హోదా పెట్టుకుని.. తెలుగుదేశం ఇంతగా బతిమాలే ధోరణిలో ఎందుకున్నదో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

నిజానికి బడ్జెట్లో అన్యాయం జరిగిందని అనిపించిన వెంటనే.. సుదీర్ఘ అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు స్వతంత్రించి ధైర్యమైన నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. అలా జరగలేదు. శివసేన పోకడలనుంచి అయినా ఆయన స్ఫూర్తి పొంది ఉండాల్సింది. అది కూడా జరగలేదు. కనీసం తమకంటె చాలా చిన్న పార్టీ అయిన శిరోమణి అకాలీదళ్ కు ఉన్న ధైర్యం కూడా ఆయనకు లేకపోతే ఎలా అనేది ప్రజల్లో మెదలుతున్న సందేహం. గట్టి స్టెప్ ఏదో ఒకటి తీసుకోకుండా.. కేంద్రం పై ఒత్తిడిపెంచడమూ.. రాష్ట్రానికి న్యాయం జరిగేలా వారిలో కదలిక తీసుకురావడమూ ఎప్పటికీ సాధ్యం కాదని కూడా పలువురు భావిస్తున్నారు. మరి ప్రజల మనోగతాన్ని చంద్రబాబునాయుడు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.