Begin typing your search above and press return to search.

చంద్రబాబు లేఖ.. మోడీకి సవాలేనా?

By:  Tupaki Desk   |   10 Jan 2018 2:15 PM GMT
చంద్రబాబు లేఖ.. మోడీకి సవాలేనా?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు .. బుధవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి అందవలసిన సాయం - దానికి సంబంధించి ఏ వనరుల నుంచి ఏ రూపంలో ఆర్థికంగా నిధులు వస్తే.. తమకు అనువుగా ఉంటుందో.. ఆ లేఖలో ఆయన వివరించారు. ఇది మంచి ప్రయత్నమే. నిజానికి ఎప్పుడో జరగాల్సిన ప్రయత్నం. అయితే మరో వారం రోజుల్లో (17వ తేదీన) చంద్రబాబు- ప్రధాని మోడీతో సమావేశం కాబోతున్న సమయంలో.. లేఖ రాయడం అనేది కీలక చర్చనీయాంశంగా మారింది. నేరుగా ప్రధానినే కలవబోతుండగా.. నిధుల పరంగా తమకు కేంద్రం అన్యాయం చేస్తున్నదనే అర్థం వచ్చేలా.. దాన్ని చక్కదిద్దాలనే సూచన చేస్తూ కేంద్రానికి రాసిన లేఖ ఖచ్చితంగా మోడీకి సవాలు విసరడం వంటిదే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబు లేఖను మోడీకి మాత్రమే రాశారు. కానీ తాను ఎజెండా అంశంగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అనివార్యంగా మోడీనే ప్రస్తావించి మాట్లాడాల్సిన అంశంగా అది చర్చల్లో నిలిచేలా ఆయన సరైన సమయం చూసి లేఖ రాశారు. కొన్ని రోజుల కిందట.. ఆంద్రప్రదేశ్ కు అందించాల్సిన సాయాన్ని విదేశీ సంస్థల నుంచి రుణంగా ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. నిజానికి ఇది రాష్ట్రానికి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో నిధులను ఆశిస్తోంటే.. వారు మాత్రం విదేశీ సంస్థల రుణాలుగా ఇప్పిస్తాం అనడం ఇబ్బందికరమే. ఈ తరహా ప్రకటన కేంద్రమంత్రి నుంచి రావడానికి పూర్వమే.. చంద్రబాబునాయుడు నుంచి లేఖ వెళ్లి ఉంటే.. పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి జారినట్టే.

కాకపోతే.. ఈ ఆర్థిక వనరులను కేంద్రంనుంచి సమకూర్చే అంశం.. ఇప్పుడు తప్పనిసరిగా మోడీతో భేటీలో భాగం అయ్యే అవకాశం ఉంది. అమరావతి రాజధాని - పోలవరం ప్రాజెక్టుల విషయంలోనే మోడీ సర్కారు ఏ మాత్రం సహకరించకుండా కాలహరణం చేస్తున్నదని.. ప్రజలు సందేహించే పరిస్థితి వచ్చింది. అలాంటి నేపథ్యంలో కీలకంగా జరగబోతున్న భేటీలో.. బాబు లేఖలోని అంశాలకు ఆయన సమాధానం ఇస్తారో లేదో చూడాలి. ఈలోగా.. అరుణ్ జైట్లీ నుంచి ప్రత్యుత్తరం కూడా వచ్చేసిందంటే గనుక.. మోడీతో భేటీ మరో ప్రతిష్టంభనకు వేదిక అయ్యే అవకాశం కూడా ఉంది.