Begin typing your search above and press return to search.

ఆ డైలాగు ఈ విషయంలో బాబు అనగలరా?

By:  Tupaki Desk   |   11 Jan 2018 8:24 AM GMT
ఆ డైలాగు ఈ విషయంలో బాబు అనగలరా?
X
అభివృద్ధి పనులు చేపట్టడం.. వాటికి కేంద్రం సాయం అందించడం... అనే వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ఓ స్థిరమైన డైలాగు ఉంటుంది. ‘‘వారు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే.. మన డబ్బులతోనే దీన్ని నిర్మించుకుందాం. మన రాష్ట్రం బాగోగులు మనమే చూసుకోవాలి..! కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. పనులు మనమే చేసుకోవాలి. వెనుకంజ వేసే సమస్యే లేదు’’ అని ఆయన తరచూ అంటూ ఉంటారు. పోలవరం విషయంలో ఈ డైలాగు అనేకసార్లు వినిపించింది. కొత్త టెండర్లు పిలిచిన తర్వాత.. వాటికి కేంద్రంనుంచి అభ్యంతరాలు వచ్చిన తర్వాత.. పలుమార్లు ఆయన ఈ మాట అన్నారు.

అదంతా పక్కన పెడితే.. తాజాగా కేంద్రం సాయం కోసం కొత్త ప్రతిపాదనలు పంపిన ముఖ్యమంత్రి.. తన ప్రతిపాదనలను అరుణ్ జైట్లీ బుట్టదాఖలు చేసేస్తే.. అప్పుడు కూడా ఇదే మాట అనగలరా? అనేది ప్రజల్లో ఇప్పుడు మీమాంసగా ఉంది. రెవెన్యూలోటు - ఉద్యోగుల జీతబత్తేలకు అవసరమైన లోటు డబ్బులను ఇవ్వడానికే కేంద్రం మీనమేషాలు లెక్కిస్తూ సాగతీస్తూ కాలహరణం చేసేస్తోంది. అలాంటి నేపథ్యంలో.. మా రాష్ట్రంలో మేము బ్రిడ్జిలు - హాస్టళ్లు - సంక్షేమభవనాలు గట్రా కట్టుకుంటాం.. మీరు ఉచితంగా 16వేల కోట్ల రూపాయలు సొమ్ములివ్వండి అని అడిగితే.. ఇవ్వడానికి వారికి మనసొప్పుతుందా? అనేది పలువురిలో కలుగుతున్న మీమాంస.

పోలవరం కొత్త టెండర్ల విషయంలో చంద్రబాబు చాలా దూకుడుగా వాళ్లు ఇవ్వకపోతే.. మన ఖజానా డబ్బుల్తో అయినా చేసేసుకుందాం అని సెలవిచ్చారు. మరి.. ఇప్పుడు ప్రతిపాదించిన పనుల విషయంలో కూడా ఆయన ఆ మాట అనగలరా? ఎందుకంటే... కేంద్రం మనం అడిగిన రీతిలో సానుకూలంగా స్పందిస్తుందనుకోవడం భ్రమే. అడిగిన పనులకు అడిగినంత మొత్తం రావడం అనేది అసాధ్యం. అందులో కోతలు పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. పూర్తిగా ఎగవేసి.. నెపాలు చెప్పి.. కావాలంటే.. విదేశీరుణాలు ఇప్పిస్తాం గ్రాంట్లు ఇవ్వడం కుదర్దు అని చేతులెత్తేసినా ఆశ్చర్యం అనవసరం. అలా జరిగినా కూడా ఈ పనుల విషయంలో చంద్రబాబు ముందడుగు వేయగలిగితేనే.. ఆయనకు వీటిమీద శ్రద్ధ ఉన్నట్లుగా భావించాలని పలువురు అంటున్నారు.