Begin typing your search above and press return to search.

‘చిల్లర’ కష్టాలకు బాబు చెప్పిన సొల్యూషన్

By:  Tupaki Desk   |   15 Nov 2016 4:35 AM GMT
‘చిల్లర’ కష్టాలకు బాబు చెప్పిన సొల్యూషన్
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తాను చెప్పినట్లే తాజాగా కేంద్రానికి ఒక లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఏపీకి రూ.1500 కోట్లు కావాలన్నారు. రూ.500 నోట్ల బాక్సులు రెండొండలు కావాలని.. అదే రీతిలో రూ.100 నోట్ల బాక్సులు మరో ఐదు వందలు కావాలని.. ఇవి మొత్తంగా రూ.1500 కోట్లు అని.. దీంతో రాష్ట్రప్రజల నోట్ల కష్టాలు తీరనున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున నోట్లు రాష్ట్రానికి వచ్చి.. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంటే ప్రజల సమస్యలు తీరిపోతాయన్న అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో కేంద్రానికి రూ.4లక్షల కోట్లు రానున్నాయని.. వాటిలో40 శాతాన్ని రాష్ట్రానికి ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరటం గమనార్హం. ఆర్ బీఐ అధికారులతోపాటు.. పలువురు ఉన్నతాధికారులతో సోమవారం మూడుదఫాలుగా భేటీ అయిన చంద్రబాబు.. చిల్లర దొరక్కపోవటం లాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కొన్ని చర్యలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. అవేమిటన్న విషయాన్ని మాత్రం బాబు చెప్పలేదు.

ఈ నెల 24 వరకు విద్యుత్ బకాయిలు.. పెట్రోల్ బంకులు.. ప్రభుత్వ సహకార మార్కెట్లు లాంటి చోట్ల పాతనోట్లను తీసుకుంటారని చెప్పిన చంద్రబాబు.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామన్నారు. ఖాతాదారులకు రూపే కార్డుల్ని జారీ చేస్తామన్న ఆయన.. వివిధ ఖాతాల్లో ఉన్న ఖాతాదారులకు వారి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని రూపే కార్డుల్లో అప్ గ్రేడ్ చేస్తామని.. ఆ కార్డులతో ఎక్కడైనా షాపింగ్ చేసుకునే వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఈ పాస్ మెషీన్లను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. జనసామ్యంలో నెలకొన్న కొన్ని ప్రచారాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బ్యాంకు ఖాతాల్లో రూ.2.5లక్షలు డిపాజిట్ చేసే వారికి రేఫన్.. ఇతర ప్రభుత్వ పథకాల్ని కోత విధిస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో అర్థం లేదని.. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు చేస్తున్న ప్రచారాలుగా ఆయన అభివర్ణించారు. బ్యాంకుల్లో వేసే డిపాజిట్లకు.. ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధం లేదన్న ఆయన.. ఇలాంటి వ్యతిరేక ప్రచారన్ని ఖండించాలంటూ పిలుపునిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ బాబు అడిగినట్లుగా.. రూ.1500 కోట్లు ఏపీకి జైట్లీ పంపుతారా..?ఆయన చెప్పిన సొల్యూషన్లకు కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/