Begin typing your search above and press return to search.

వ‌ర్షాకాలానికి ఏపీకి హైకోర్టు వ‌చ్చేస్తుందా?

By:  Tupaki Desk   |   28 Dec 2017 4:47 AM GMT
వ‌ర్షాకాలానికి ఏపీకి హైకోర్టు వ‌చ్చేస్తుందా?
X
విభ‌జ‌న జ‌రిగి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా నాలుగేళ్లు అవుతోంది. నేటికి విభ‌జ‌న‌లో భాగంగా చేయాల్సిన ప‌నుల్లో చాలావ‌ర‌కు ప్రారంభ‌మే కాదు. ఇలాంటి వాటిల్లో హైకోర్టు ఒక‌టి. తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ హైకోర్టు త‌మ‌కు కావాల‌ని విభ‌జ‌న నాటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా అడుగులు ప‌డ‌లేదు. తాజాగా హైకోర్టు విభ‌జ‌న‌కు సంబందించి కీల‌క‌మైన ప‌త్రంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంత‌కం చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

వ‌చ్చే ఏడాది వ‌ర్షాకాలానికి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికైన ఆల‌స్యం స‌రిపోతుంద‌ని.. ఇక‌పై ఆల‌స్యం కాకుండా వెంట‌నే హైకోర్టును ఏపీకి వ‌చ్చేలా చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఏపీలో ఏర్పాటు చేసే తాత్కాలిక హైకోర్టుకు సంబంధించి ఏపీ స‌ర్కారు రెండు. మూడు భ‌వ‌నాల్ని సిద్ధం చేసి.. వాటిలో అనువుగా ఉన్న దాని గురించి త‌మ అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా ఉమ్మ‌డి హైకోర్టు తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రమేశ్ రంగ‌నాథ్ ను కోరుతూ ఒక లేఖ‌ను చంద్ర‌బాబు పంపిన‌ట్లుగా చెబుతున్నారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించాల‌ని భావిస్తున్న శాశ్విత హైకోర్టుకు సంబంధించిన న‌మూనాను ఖ‌రారు వ్య‌వ‌హారం చివ‌రిద‌శ‌లో ఉంది. హైకోర్టు శాశ్విత భ‌వ‌నం నిర్మాణ ప‌నులు మొద‌లెట్టిన త‌ర్వాత త‌క్కువ‌లో త‌క్కువ ప‌ద‌హారు నెల‌ల స‌మ‌యం ప‌ట్టే వీలుంది. దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ హైకోర్టును హైద‌రాబాద్‌ లోనే ఉంచ‌టం క‌ష్ట‌మ‌వుతుంద‌న్న భావ‌న‌లో ఏపీ స‌ర్కారు ఉంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అమ‌రావ‌తికి వ‌చ్చేసి ద‌గ్గ‌ర్లో ద‌గ్గ‌ర రెండేళ్ల‌కు పైనే అయిన నేప‌థ్యంలో ఇక ఆల‌స్యం చేయ‌కుండా హైకోర్టును అమ‌రాతికి తీసుకొచ్చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఏపీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఉమ్మ‌డి హైకోర్టు హైద‌రాబాద్ లో ఉండ‌టంతో.. త‌ర‌చూ కోర్టుకేసుల ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్‌ కు వెళ్లాల్సి వ‌స్తోంది. దీంతో.. పెద్ద ఎత్తున వ్య‌య‌ప్ర‌యాస‌లకు గురి అవుతున్న ప‌రిస్థితి. ఇలాంటి ఇబ్బందుల్ని అధిగ‌మించే ప‌నిలో భాగంగా అమ‌రావ‌తి ప‌రిధిలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేసి.. 2019 నాటికి శాశ్విత హైకోర్టును సిద్ధం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఏపీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఉమ్మ‌డి హైకోర్టులో ప‌ని చేస్తున్న న్యాయ‌మూర్తుల్ని ఇటీవ‌ల కేంద్ర స‌ర్కారు విభ‌జించిన సంగ‌తి తెలిసిందే. న్యాయ‌మూర్తులు కోరుకున్న ఆప్ష‌న్ ప్ర‌కారం ఉమ్మ‌డి హైకోర్టులో ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న 31 మంది జ‌డ్జిల‌లో 17 మంది ఏపీకి.. 12 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఇద్ద‌రున్యాయ‌మూర్తులు ఇరు రాష్ట్రాల‌కు చెందిన వారున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ హైకోర్టులో ప‌ని చేస్తున్న న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దామా శేషాద్రినాయుడ్ని ఏపీకి కేటాయించారు. ఏపీ స‌ర్కారు ప్ర‌స్తుతం పంపిన‌ట్లుగా చెబుతున్న భ‌వ‌నాల‌పై ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సానుకూలంగా స్పందిస్తే.. హైకోర్టు త‌ర‌లింపు ప్ర‌క్రియ వేగ‌వంత‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు. విభ‌జ‌న త‌ర్వాత తాత్కాలిక హైకోర్టు దిశ‌గా ఏపీ స‌ర్కారు ఇప్ప‌టికి రియాక్ట్ కాగా.. మ‌రి.. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి త‌న అభిప్రాయాన్ని ఎప్ప‌టికి పంపుతారో చూడాలి.