Begin typing your search above and press return to search.

బాబు ఎంపీ సీట్ల మోజు..కామెడీ అయిపోతున్న ఏపీ

By:  Tupaki Desk   |   14 April 2018 1:42 PM GMT
బాబు ఎంపీ సీట్ల మోజు..కామెడీ అయిపోతున్న ఏపీ
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఇంకా చెప్పాలంటే...మ‌హ‌నీయుడి స్మ‌ర‌ణ వేదిక‌గా రాజ‌కీయాలు మాట్లాడారు. గుంటూరులో జరిగిన ఐనవోలులో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగం గురించి అనూహ్య వ్యాఖ్య‌లు చేస్తూనే అదే స‌మ‌యంలో త‌న రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌ను ఆయ‌న బ‌య‌ట‌పెట్టుకున్నారు. ఎంపీ సీట్లు ఇస్తే తాను హోదా కోసం పోరాటం చేస్తాన‌ని స్పెష‌ల్ స్టేట‌స్ విష‌యంలో కొత్త ట్విస్ట్ ఇచ్చారు చంద్ర‌బాబు.

రాజ్యాంగం రచనా భారం మొత్తం అంబేద్కర్ ఒక్కరే చేశారని, అది ఆయన పట్టుదల అని చంద్ర‌బాబు తెలిపారు. ``అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం మంచిదే కావచ్చు, కానీ దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లతై అంబేద్కర్‌ రాజ్యాంగమే చెడ్డదవుతుంది’’ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్ హాయాంలో అంబేద్కర్ కి భారతరత్న వచ్చిందని బాబు సెల‌విచ్చారు. 100 కోట్లతో 20 ఎకరాలలో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఉండేలా అంబేద్కర్ స్మృతి వనం ఉంటుందని తెలిపారు. తనను విమర్శించే అర్హత బీజేపీకి - వైసీపీకి లేదని, తాను ఏమి చేసినా పేదల కోసం చేస్తున్నామని, ప్రజల కోసం ప్రజా రాజధాని అని చెబుతున్నానని చంద్బ‌రాబు పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ``వ‌చ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తా’’ అని ప్ర‌క‌టించారు. అయితే 2019ఎన్నికల తర్వాత టీడీపీ ఎవరికి మద్దతిస్తే వారే కేంద్రంలో అధికారంలోకి వస్తారని, ఆ విధంగా ఢిల్లీలో తాను చక్రం తిప్పుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాగా, ప్ర‌స్తుతం ఇటు లోక్‌స‌భ‌, అటు రాజ్య‌స‌భ క‌లుపుకొని 20 మంది ఎంపీలు ఉండ‌గా సాధించ‌లేనిది 25 మంది ఎంపీ సీట్లు వ‌చ్చిన త‌ర్వాత ఎలా సాధిస్తార‌నే సందేహాన్ని ప‌లువురు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. కేవ‌లం ఐదుగురు ఎంపీల‌ను అధికంగా గెలిపించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఎంపీ సీట్ల మోజుతో ఏపీని న‌వ్వుల పాలు చేయ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.