Begin typing your search above and press return to search.

755 ఏళ్ల తేడాతో ఒకే తేదీన...రెండు అద్భుతాలు

By:  Tupaki Desk   |   26 March 2016 4:44 AM GMT
755 ఏళ్ల తేడాతో ఒకే తేదీన...రెండు అద్భుతాలు
X
కొన్ని కొన్ని సంఘటనలు అనూహ్యంగా జరిగిపోతుంటాయి. ఎలాంటి ప్లాన్ లేకుండా కొన్నిసార్లు జరిగే ఘటనలు. చూసినప్పుడు ఎక్కడో ఏదో లింకు ఉన్నట్లుగా అనిపిస్తాయి. తర్కబద్ధంగా వాటిని నిరూపించే అవకాశం లేనప్పుడు.. భలే జరిగిందే అన్న మాట మాత్రం అనుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో 755 ఏళ్ల కిందట మార్చి 25న ఒక భారీ సంఘటన చోటు చేసుకుంటే.. కొన్ని వందల ఏళ్ల తర్వాత అదే రోజున.. మరో చారిత్రక ఘటన చోటు చేసుకోవటం.. అది కూడా ఏమీ ప్లానింగ్ లేకుండా జరగటం ఆసక్తికరం.

ఇంతకీ 755 సంవత్సరాల కిందట ఏం జరిగిందన్నది చూస్తే.. కాకతీయ పట్టపురాణి రుద్రమదేవి పట్టాభిషేకం మార్చి 25నే జరిగింది. అనూహ్యంగా ఇన్నేళ్ల తర్వాత నిన్న (శుక్రవారం.. మార్చి 25) ఏపీ ప్రజల కలల రాజధాని నగరమైన అమరావతి నగరానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. అమరావతి నిర్మాణానికి సంబంధించి.. కీలకమైన ఆర్కిటెక్ట్ నమూనాల్ని సుదీర్ఘంగా పరిశీలించి.. ఓకే చెప్పిన ఘటన చోటు చేసుకోవటం ఆసక్తికర సంఘటనగా చెప్పాలి.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావోద్వేగానికి గురి అవుతూ.. ‘‘755 ఏళ్ల కిందట ఇదే రోజున వేయించిన స్తూపాన్ని ఈరోజే చూశాను. 15 – 20 అడుగుల ఎత్తులో ఉంది. దానిపై శాసనాలు ఉన్నాయి. పై భాగంలో నంది అమరావతి వైపు చూస్తూ ఉంటుంది. నందికి దిగువన తూర్పు వైపు నాగేంద్రుడు.. దక్షిణం వైపు వినాయకుడు.. పడమర శివలింగం.. ఉత్తరం వైపు కుమారస్వామి రూపాలు చెక్కారు. దాని పక్కనే ఓరుగల్లు శిల్ప సంపదను పోలిన గుడి ఉండేది. దండయాత్రలతో నాశనమైంది. ఇంత చారిత్రక నగరం కాబట్టే.. తొలి రోజు నుంచి ఏ పని చేసినా అనూహ్యంగా కలిసి వస్తోంది’’ అని చెప్పటం సమంజసంగా అనిపించక మానదు.