Begin typing your search above and press return to search.

డేటా చోరీలో క‌ల‌క‌లం!..ఐటీ గ్రిడ్స్ సీఈఓను చంపేస్తార‌ట‌!

By:  Tupaki Desk   |   17 April 2019 4:17 PM GMT
డేటా చోరీలో క‌ల‌క‌లం!..ఐటీ గ్రిడ్స్ సీఈఓను చంపేస్తార‌ట‌!
X
తెలుగు రాష్ట్రాల్లో పెను క‌ల‌క‌ల‌మే రేపిన డేటా చోరీ విష‌యంలో సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు న‌మోద‌వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల‌కు ముందే ఈ కేసు న‌మోదైనా... ఎన్నిక‌ల త‌రుణంలో ఈ కేసు ద‌ర్యాప్తు దాదాపుగా మూల‌న ప‌డింద‌నే చెప్పాలి. అయితే ఎన్నిక‌లు ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే ఈ కేసుకు బూజు దులిపిన సిట్‌... ద‌ర్యాప్తును వేగ‌వంతం చేసింది. కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిట్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇలాంటి త‌రుణంలో అశోక్ అరెస్టైతే... ఎక్క‌డ తాము బుక్ అయిపోతామోన‌న్న భ‌యంతో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... అశోక్ ను ఏమైనా చేసేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌న్న వార్త ఇప్పుడు నిజంగానే వైర‌ల్ గా మారిపోయింది. ఈ మేర‌కు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస‌గా చేసిన ట్వీట్ల‌లో విజ‌య‌సాయిరెడ్డి ఈ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు.

టీడీపీ రూపొందించిన సేవా మిత్ర యాప్ కోస‌మంటూ ఆ పార్టీ నియ‌మించుకున్న సంస్థ ఐటీ గ్రిడ్ తెలుగు రాష్ట్రాల్లోని 7.58 కోట్ల మంది వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని సేక‌రించింది. ప్ర‌భుత్వం వ‌ద్ద మాత్ర‌మే భ‌ద్రంగా ఉండాల్సిన ఈ స‌మాచారం ప్రైవేట్ సంస్థ వ‌ద్ద ఎలా ఉందంటూ ప‌లువురు చేసిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంతో పాటుగా ఏకంగా ఈ కేసు ద‌ర్యాప్తున‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన ఈ సిట్... కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్త సీఈఓ అశోక్ ను అరెస్ట్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలోనే త‌మ ముందు విచార‌ణ‌కు రావాల‌ని అశోక్ కు ఇప్ప‌టికే మూడు ప‌ర్యాయాలు నోటీసులు జారీ చేసింది. కేసు న‌మోద‌య్యే దాకా హైద‌రాబాదులోని మాదాపూర్ లో ఉంటున్న త‌న కార్యాల‌యంలోనే ఉంటున్న అశోక్‌... కేసు న‌మోదైన మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌న త‌న మ‌కాంను ఏపీకి మార్చేవారు.

టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న అశోక్‌... ఏపీలోని ప్ర‌కాశం జిల్లాకు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. అయితే ద‌ర్యాప్తున‌కు స‌హ‌క‌రించేందుకు స‌సేమిరా అంటూ వ‌స్తున్న అశోక్... కోర్టు విచార‌ణ‌ల‌కు కూడా హాజ‌రు కాలేదు. ఈ క్ర‌మంలో అశోక్ ను అరెస్ట్ చేయ‌క త‌ప్ప‌ద‌న్న భావ‌న‌తో సిట్ ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దించేసింది. రేపో - మాపో అత‌డిని అరెస్ట్ చేయ‌డం కూడా దాదాపుగా ఖ‌రారైంద‌న్న వార్త‌లు కూడా వినిపించాయి. ఈ క్ర‌మంలోనే సాయిరెడ్డి చేసిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు వైర‌ల్ గా మారిపోయాయి. త‌మ అక్ర‌మాల‌ను వెలుగులోకి రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న చంద్ర‌బాబు... అశోక్ ను ఏమైనా చేసేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

అశోక్ నోరు విప్పితే... చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ కూడా ఇరుక్కుంటార‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప్రాణ హానీ ఉన్న విష‌యాన్ని అశోక్ ఎంత త్వ‌ర‌గా గుర్తిస్తే... అంత మంచిద‌ని - లేని ప‌క్షంలో ఎవ‌రైతే త‌న‌కు ఆశ్ర‌య‌మిస్తున్నార‌ని అశోక్ భావిస్తున్నారో - వారి చేతిలోనే అంత‌మైతార‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి డేంజ‌ర్ బెల్స్ మోగించారు. ప్రాణాలు కాపాడుకోవాలంటే... త‌క్ష‌ణ‌మే అత‌డు పోలీసుల ఎదుట లొంగిపోవాల‌ని కూడా విజ‌య‌సాయిరెడ్డి సూచించారు. చంద్ర‌బాబు ఆశ్ర‌యంలోనే ఉన్నాడ‌ని భావిస్తున్న అశోక్ కు చంద్ర‌బాబు నుంచే హానీ ఉంద‌ని హెచ్చరిక‌లు జారీ చేసిన విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.