Begin typing your search above and press return to search.

సెగ్మెంట్ల పెంపు సాధించడం బాబు తరం కాదు!

By:  Tupaki Desk   |   12 Jan 2018 5:09 AM GMT
సెగ్మెంట్ల పెంపు సాధించడం బాబు తరం కాదు!
X
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన - సీట్ల పెంపు అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఒక తప్పనిసరి అవసరం. ఎందుకంటే.. ఆయన ఆ ‘‘సీట్ల పెంపు’’ అనే బ్రహ్మపదార్థాన్ని అరచేతిలో వైకుంఠంలాగా చూపించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని అనేకమంది నాయకులకు ఎరవేశారు. వారిని తన పార్టీలో కలిపేసుకున్నారు. కేవలం వైకాపా ఎమ్మెల్యేలు - నియోజకవర్గాల్లోని సీనియర్ నాయకులు అనే వ్యత్యాసాలు ఏమీ లేకుండా.. వైకాపాను బలహీనం చేయడం ఒక్కటే లక్ష్యంగా అనుకుంటూ.. ఎవరు పడితే వారిని తన పార్టీలో చేర్చేసుకున్నారు. వీరందరికీ కూడా అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి. మీకందరికీ ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తా.. అనే కల్లబొల్లి మాటలనే చెప్పారు. అయితే సీట్ల పెంపు అనేది అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి భేటీకి కూడా అదే ఎజెండా తో చంద్రబాబు నాయుడు- మోడీ వద్దకు వెళుతున్నారు గానీ.. దానిని 2019 ఎన్నికల్లోగా సాధించడం ఆయన తరం కాకపోవచ్చునని విశ్లేషణలు సాగుతున్నాయి.

విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోను అసెంబ్లీ సీట్లను పెంచడం అనే వ్యవహారం కూడా ఉంది. అయితే.. ఇది మాత్రం ఏదో ఇరు రాష్ట్రాల ఆస్తులు పంచినంత ఈజీగా చేసేయగలిగేది కాదు. రాజ్యాంగ సవరణతో కూడుకున్న వ్యవహారం. పైగా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 2022లోగా పూర్తయ్యేందుకు సాంకేతికంగా అవకాశం లేదని కేంద్రవర్గాలు తొలినుంచి చెబుతూనే ఉన్నాయి. అయితే చంద్రబాబునాయుడు అదే ఆశ చూపించి ఎంతో మందని తన తెలుగుదేశం పార్టీలో కొత్తగా చేర్చుకున్నారు.

దీనివల్ల పలుచోట్ల తెదేపా సంక్షోభంలో ఉంది. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు - కొత్తగా వచ్చిన వారి మధ్య తరచూ తగాదాలు గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలను సర్దుబాటు చేసేంద నేర్పు గానీ.. ఓపిక గానీ అధినేత వద్ద లేవు. సీట్ల సంఖ్య పెరిగితే.. అన్ని సమస్యలూ ఒక కొలిక్కి వస్తాయని అనుకుంటూ ఉంటే.. అది ఎంతకూ ముందుకు వెళ్లడం లేదు. అందుకే ఆ అంశాన్ని కూడా ఎజెండా లో ప్రధానంగా పెట్టుకుని బాబు మోడీని కలుస్తున్నారు. అయితే ఈ విషయం అంత ఈజీగా తేలేది కాదని.. బాబుకు నిరుత్సాహం తప్పదని... సంక్షోభ నియోజకవర్గాల్లో తలనొప్పులు కూడా తప్పవని పలువురు భావిస్తున్నారు.