Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:14 AM GMT
కేసీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు
X
తెలుగు రాష్ట్రం రెండు ముక్కలుగా మారిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులూ ఒకరిని చూసి ఒకరు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదేమీ తప్పు కూడా కాదు. కాకపోతే తాజాగా ప్రజలు హర్షించే ఒక విషయంలో మాత్రం అచ్చంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లోనే ఒకింత ఆలస్యంగా చంద్రబాబు సర్కారు కూడా నడుస్తోంది.

తెలుగు భాషకు సరైన ఆదరణ కల్పించే విషయంలో కేసీఆర్ సర్కారు ఎన్నడో ముందడుగు వేసింది. ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు వాతావరణం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యాన్ని కూడా మంటగలిపేస్తున్న పరిస్థితి. సామాన్యులు విద్యనభ్యసించే మునిసిపల్ స్కూళ్లలో కూడా అనివార్యంగా ఇంగ్లిష్ మీడియా ను కంపల్సరీ చేస్తూ విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం అనే కబుర్లు చెబుతూ.. మొత్తానికి తెలుగుభాషకు పాఠశాలల్లో ఆదరణ లేని పరిస్థితికి వాతావరణం దారి తీస్తూ ఉంది. నెమ్మదిగా పాఠశాలల కార్పొరేటీకరణకు రంగం సిద్ధం అవుతున్నదని అందరూ విమర్శిస్తూ ఉండేవాళ్లు. అలాంటి నేపథ్యం ఉండేది. తెలుగుభాషను కాపాడుకోవడం గురంచిన స్పృహ ఉండేదే కాదు. దాన్ని గురించి ఎలాంటి చర్యలూ లేవు.

అలాంటి సమయంలో తెలంగాణలో కేసీఆర్ తెలుగుభాషకోసం నిర్దిష్టంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పాఠశాలలోనూ సీబీఎస్ ఈ - ప్రెవేటు పాఠశాలలు అయినా సరే.. తెలుగు చదవడాన్ని కంపల్సరీ చేసేశారు. భాష మనుగడను కాపాడాలంటే ఈ నిర్ణయం తప్పనిసరి అని, తెలంగాణలో విద్యఅభ్యసించే వాళ్లందరూ తెలుగు నేర్చుకోవాల్సిందే అని ప్రకటించారు. భాషాప్రేమికుల తరఫు నుంచి కేసీఆర్ నిర్ణయానికి బహుదా ఆదరణ లభించింది.

ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు కూడా తెలుగుభాష పట్ల ఎంతటి మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే. తేటతెలుగులో మాట్లాడడం - తెలుగుభాష కు ఆదరణ గురించి ఆయన తపించడం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. అలాంటి వెంకయ్యనాయుడు కేసీఆర్ నిర్ణయాన్ని పలువేదికల మీదనుంచి ప్రశంసించారు. ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా భాషా పరిరక్షణకు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని.. పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ఆయన కోరారు.

ఈ సూచనలన్నీ చంద్రబాబు వైఖరిలో మార్పు తెచ్చాయో ఏమోగానీ.. ఒకింత ఆలస్యంగా అయినా ఆయన కేసీఆర్ అడుగుజాడల్లో భాషకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. తెలుగును అభ్యసించడం తప్పనిసరి చేశారు. రెండు తెలుగు ప్రభుత్వాల ఈ నిర్ణయం వల్ల తెలుగు భాష మనుగడ ప్రమాదంలో పడకుండా ఉంటుందని ఆశించవచ్చు.