Begin typing your search above and press return to search.

బొండా ఉమపై చంద్రబాబు వేటేస్తారా?

By:  Tupaki Desk   |   16 May 2017 7:42 AM GMT
బొండా ఉమపై చంద్రబాబు వేటేస్తారా?
X
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీలో కళంకితులపై వేటేసి సచ్ఛీలత నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే రీసెంటుగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. త్వరలో మరికొన్ని వికెట్టు కూడా పడతాయన్న ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బొండా ఉమపైనా చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బొండా ఉమ అనుచరులకు సంబంధించిన వివాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆయనపై వేటేసి ప్రజల్లో మార్కులు కొట్టేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా వినిపిస్తోంది.

విజయవాడలో క్యాన్సర్‌ తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ మరణం తెలిసిందే. సాయిశ్రీ ఇంటిని టీడీపీ ఎమ్మెల్యే బోండా అనుచరులు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇల్లు అమ్ముకుని వైద్యం చేయించుకుంటామని సాయిశ్రీ తల్లి పదేపదే ప్రాథేయపడినా బోండా ఉమా కనికరించలేదని... దీంతో సాయిశ్రీ ఆదివారం మధ్యాహ్నం చనిపోయిందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది.

చనిపోవడానికి ముందు తనను బతికించాలంటూ సాయిశ్రీ వేడుకుంటున్న సెల్ఫీ వీడియో అందరినీ కలచివేసింది. ఈనేపథ్యంలో స్పందించిన హెచ్‌ ఆర్ సీ జులై 20లోగా బోండా ఉమా - సాయిశ్రీ తండ్రి శివకుమార్‌ లపై పూర్తి నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీని ఆదేశించింది. బోండా ఉమా వర్గం నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సాయిశ్రీ తల్లి సుమశ్రీ కోరుతున్నారు.

కాగా బొండా ఉమపై గతంలోనూ పలు ఆరోపణలున్నాయి. ఇటీవల మంత్రి వర్గ విస్తరణ సమయంలోనూ ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. అంతేకాదు... ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన వైపు చూస్తున్నారన్న అనుమానం కూడా చంద్రబాబులో ఉందన్న వాదన ఒకటి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రజల్లో మైలేజి వస్తుందనుకుంటే ఉమపై వేటేయడానికి చంద్రబాబు సిద్ధపడొచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే... టీడీపీలో బ్యాంకులను మంచిన నేతలు.. ఇతర భారీ స్కాముల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. వారందరినీ విడిచిపెట్టి కొన్ని వర్గాలనే లక్ష్యం చేసుకుంటున్నారాన్న విమర్శలు వస్తాయేమోనన్న భయమూ పార్టీలో ఉంది. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్ని వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/