Begin typing your search above and press return to search.

బాబు అక్వా సమీక్షలో మిస్ అయిన ముఖ్యాంశం

By:  Tupaki Desk   |   16 Oct 2016 11:30 AM GMT
బాబు అక్వా సమీక్షలో మిస్ అయిన ముఖ్యాంశం
X
అధికారంలో ఉన్న వారికి లేని వారికి మధ్య ఉండే వ్యత్యాసం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగోల్ని.. పట్టుదల్ని పక్కన పెట్టేయాలే కానీ.. ఒక్క నిర్ణయంతో మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయొచ్చు. అప్పటివరకూ తమపై వచ్చే విమర్శల్ని ఒక్క నిర్ణయంతో తమకు అనుకూలంగా మార్చుకోవటమే కాదు.. ప్రతికూల పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చేసే వీలు అధికారపక్షానికి ఉంటుంది. అయితే.. అలా చేసే నైపుణ్యం అధికారపక్ష అధినేతకు ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఇలాంటి చతురత ప్రముఖంగా కనిపిస్తుంటుంది.

కారణాలు ఏమైనా కొన్ని విషయాలు ఆయన దృష్టికి సరైన సమయంలో రాకుండా డ్యామేజ్ జరుగుతున్నా.. లేదంటే అంచనాలకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నా ఆయన కానీ ఆ ఇష్యూ మీద కూర్చున్నారంటే.. లెక్క తేల్చేయటమే కాదు.. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేసుకుంటారు. మొన్నటికి మొన్న జరిగిన కొత్త జిల్లాల వ్యవహారమే తీసుకుంటే.. కొత్త జిల్లాల కోసం పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన మాత్రం విపక్షాలు డిమాండ్ చేస్తున్న జిల్లాల మీద పెదవి విప్పింది లేదు.

కానీ.. ఈ వ్యవహారం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే స్థాయికి వెళుతుందన్న మాట ఆయన చెవిన పడిన వెంటనే వేగంగా రియాక్ట్ కావటమేకాదు.. అనూహ్య నిర్ణయాలు తీసుకొని.. తనకు ఇగో లేదని.. రాజకీయాల కోసం అనవసరమైన పట్టుదలకు పోనన్న విషయాన్ని స్పష్టం చేస్తూ.. 27 జిల్లాల స్థానే ఏకంగా 31 జిల్లాల్ని ఏర్పాటు చేసేందుకు రెఢీ కావటం తెలిసిందే. అయితే.. ఇలాంటి చతురత ఏపీ ముఖ్యమంత్రిలో పెద్దగా కనిపించదు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుణ్యమా అని తెర మీదకు వచ్చిన మెగా అక్వాఫుడ్ పార్క్ ఉదంతాన్నే చూస్తే.. రెండు కీలకాంశాలు తెర మీదకు వచ్చాయి. అందులో ఒకటి అక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న రైతుల గోడు వినటం.. రెండోది.. పోలీసుల దుర్మార్గ వైఖరితో.. ఆ ప్రాంతంలో సెక్షన్ 144 అమలు చేయటంతోపాటు.. ఆడ.. మగ అన్న తేడా లేకుండా బైండోవర్ కేసులు పెట్టటం. పవన్ సీన్లోకి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిన గంటల వ్యవధిలో ఈఅంశంపై ఏపీ ముఖ్యమంత్రి సమీక్షను నిర్వహించారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. సమీక్ష అనంతరం మాట్లాడిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అక్వాఫుడ్ పార్క్ పై ప్రజల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని చెబుతూ కొన్ని నిర్ణయాల్ని వెల్లడించారు. వీటిల్లో ఎక్కడా ఫుడ్ పార్క్ కు నిరసనగా ఆందోళనలు నిర్వహిస్తున్న గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తేసే అంశం కానీ.. నిరసనలు చేసిన వారిపై నమోదు చేసిన కేసుల్ని తీసేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన వైనం కనిపించదు. పవన్ వద్దకు వచ్చిన బాధితులు అక్వా ఫుడ్ పార్క్ మీద ఎంత ఆందోళన వ్యక్తం చేశారో.. పోలీసుల తీరు మీదా అంతే ఆవేదనను వ్యక్తం చేయటం మర్చిపోకూడదు. కానీ.. బాధితులపై పోలీసులు నమోదు చేసిన కేసుల విషయాన్ని ప్రస్తావించకపోవటం ద్వారా బాబు కీలకమైన పాయింట్ స్కిప్ చేశారన్న విమర్శ వ్యక్తమయ్యేలా చేసిందని చెప్పాలి. చేసే పనిని పూర్తిగా.. అందరికి సంతృప్తికరంగా చేసేలా బాబు ఎందుకు జాగ్రత్తలు తీసుకోరు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/