Begin typing your search above and press return to search.

బాబు మాట‌!..జ‌మ్మ‌ల‌మ‌డుగులో చెల్ల‌ట్లేదే!

By:  Tupaki Desk   |   24 Jan 2019 9:42 AM GMT
బాబు మాట‌!..జ‌మ్మ‌ల‌మ‌డుగులో చెల్ల‌ట్లేదే!
X
క‌డ‌ప జిల్లా రాజ‌కీయం మ‌రింత ర‌స‌కందాయంలో ప‌డిపోయింద‌నే చెప్పాలి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డిని ఆయ‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోనే దెబ్బ కొట్టాల‌ని వ్యూహాల వ్యూహాలు ర‌చిస్తున్న తెలుగుదేశం పార్టీ... ఆ వ్యూహాల అమ‌లులో మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ ఎదురు దెబ్బ‌లు తింటోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ పై జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన చ‌దిపిరాళ్ల ఆదినారాయ‌ణ రెడ్డి... ఆ త‌ర్వాత టీడీపీ సంధించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు ప‌డిపోయారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీకి మ‌స్కా కొట్టేసి అధికార పార్టీలోకి చేరిపోయారు. ఆ త‌ర్వాత ఏకంగా మంత్రిగా కూడా ప్ర‌మోష‌న్ సంపాదించారు. త‌ద‌నంత‌రం జిల్లాలో త‌న ప‌ట్టును పెంచుకునేందుకు చాలా సైలెంట్‌ గానే ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి న‌మ్మిన బంటుగా ఉన్న మాజీ మంత్రి - ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డికి... ఆదినారాయ‌ణ రెడ్డికి పెరుగుతున్న ప్రాబ‌ల్యం ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగిస్తూనే ఉంది.

చంద్ర‌బాబు పిల‌వ‌డం... పంచాయితీ చేయ‌డం - అక్క‌డిక‌క్క‌డిదాకా ఇద్ద‌రూ క‌లిసి ఉన్న‌ట్లుగానే క‌నిపించ‌డం - బ‌య‌ట‌కు రాగానే ఎడ‌ముఖం పెడ‌ముఖంగా మారిపోవ‌డం - మ‌ళ్లీ కీచులాడుకోవ‌డం... తిరిగి చంద్ర‌బాబు వ‌ద్ద‌కు పంచాయితీకి వెళ్ల‌డం ప‌రిపాటిగా మారిపోయింది. ఇక చంద్ర‌బాబు విష‌యానికి వస్తే... రాష్ట్రంలో ప్ర‌తి చోటా త‌న మాట‌కు విలువ‌నిస్తూ నేత‌లు స‌ర్దుకుపోతుంటే... ఒక్క జ‌మ్మ‌ల‌మ‌డుగులో మాత్రం త‌న మాట చెల్లుబాటు కాక‌పోతుండ‌టం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారిపోయింది. ఈ వ్య‌వ‌హారం చంద్ర‌బాబుకు పంటికింద రాయిలా మారిందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఎందుకంటే... ఇప్ప‌టికే చాలాసార్లు పంచాయితీలు నిర్వ‌హించినా... త‌న వ‌ద్ద బాగానే ఉంటున్న ఆది - రామ‌సుబ్బారెడ్డిలు... బ‌య‌టకు వెళ్ల‌గానే మ‌ళ్లీ శ‌త్రువుల్లా మారిపోతున్న వైనం చంద్ర‌బాబుకు క‌నిపిస్తూనే ఉంది. తాజాగా నిన్న మ‌రోమారు ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను పిలిచిన చంద్ర‌బాబు... ఇద్ద‌రి మ‌ధ్య స‌మోధ్య కుదిర్చేందుకు య‌త్నించార‌ట‌. అయితే అప్ప‌టిదాకా చంద్రబాబు మాట‌కు విలువ‌నిచ్చిన ఇద్ద‌రు నేత‌లు... ఈ ద‌ఫా మాత్రం చంద్ర‌బాబు మాట‌కు క‌ట్టుబ‌డ‌లేకపోయార‌ట‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ టికెట్ రామ‌సుబ్బారెడ్డి - క‌డ‌ప పార్ల‌మెంటు సీటు ఆదినారాయ‌ణ రెడ్డికి ఇవ్వాల‌న్న‌ది చంద్ర‌బాబు ప్లాను. నిన్న‌టిదాకా ఆది కూడా అందుకు న‌సుగుతూనే స‌రేన‌న్నా... నిన్న‌టి భేటీలో మాత్రం త‌న‌కూ జ‌మ్మ‌ల‌మ‌డుగు టికెట్ కావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో ఇన్ని రోజులుగా జ‌రుపుతున్న చ‌ర్చ‌లు నిష్ప‌ల‌మ‌య్యాయ‌ని - ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు త‌ల ప‌ట్టుకున్నార‌ట‌. అయినా మూడేళ్ల క్రితం పార్టీలోకి వ‌చ్చిన ఆది కోసం ఏళ్లుగా ఇక్క‌డ ఉన్న తాను త‌ప్పుకోవాలంటే ఎలాగన్న‌ది రామ‌సుబ్బారెడ్డి వాద‌న‌గా వినిపిస్తుంటే... విపక్షానికి భారీ దెబ్బ కొట్టి వ‌స్తే... తాను గెలిచిన చోటును కాకుండా వైసీపీ చేతిలో ఓడిపోయే సీటుకు వెళ్ల‌మంటే ఎలాగంటూ ఆదినారాయ‌ణ రెడ్డి వాదిస్తున్నార‌ట‌. విడివిడిగా వింటే ఇద్ద‌రి వాద‌న‌లూ క‌రెక్టుగానే క‌నిపిస్తున్న నేప‌థ్యంలో... చంద్ర‌బాబు ఎవ‌రి వైపు మొగ్గాలో - ఎవ‌రి వైపు మొగ్గితే ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు నిజంగానే త‌ల ప‌ట్టుకున్నార‌ట‌.