Begin typing your search above and press return to search.

ఎవరో ఒకరితో సమీక్షించకపోతే బాబుకు నిద్రపట్టదా?

By:  Tupaki Desk   |   28 April 2019 6:01 AM GMT
ఎవరో ఒకరితో సమీక్షించకపోతే బాబుకు నిద్రపట్టదా?
X
ఎలక్షన్ కమిషన్ - ఆ కమిషన్ నియమించిన కొత్త సీఎస్ కలిసి చంద్రబాబును ఆటాడుకుంటున్న సంగతి తెలిసిందే. అసలే చంద్రబాబు... ఆపై ఆయన్ను అధికారులతో సమీక్షలు నిర్వహించకుండా అడ్డుకుంటే ఇంకేమైనా ఉందా..? కాళ్లు చేతులు కట్టేసినట్లుగా ఉంటుంది చంద్రబాబుకు. పోలింగ్ తరువాత నుంచి ఒకట్రెండు సమీక్ష ప్రయత్నాలు చేసినా దానికి ఈసీ - సీఎస్ అడ్డుతగలడంతో వెనుకాముందు ఆలోచిస్తున్న చంద్రబాబు సమీక్షలు నిర్వహించకుండా తాను ఉండలేనంటున్నారు. దాంతో సమీక్షలు నిర్వహించకుండా - మీటింగులు పెట్టకుండా - గంటలు గంటలు మాట్లాడకుండా ఉంటే చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది వచ్చే ప్రమాదముందని ఆందోళన చెందిన కొందరు పార్టీ సీనియర్ నేతలు ఒక ఆలోచనకు వచ్చారట. ఆలోచన వచ్చిందేతడవుగా వారు చంద్రబాబు చెవిలో ఆ మాట చెప్పారట. ఇంకేముంది.. సమీక్షామాత్యుడు చంద్రబాబుగారు వెంటనే కార్యాచరణ కోసం షెడ్యూల్ ప్రకటించేశారట. ఇంతకీ సీనియర్ నేతలు చంద్రబాబుకు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా.. ఎలాగూ అధికారులతో మీటింగులు పెడితే నో అంటున్నారు కాబట్టి ఆలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ నాయకులతో సమీక్షలు - మీటింగులు పెట్టుకోమన్నారట.

సో... మే 2 నుంచి ఈపని మొదలుపెట్టబోతున్నారట. లోక్‌ సభ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి సుమారు 50 మంది ముఖ్య నాయకులు ఈ సమీక్షల్లో పాల్గొంటారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారికి పక్కనే ఉన్న సీకే కన్వెన్షన్‌ హాల్‌ లో మే 2 నుంచి 16 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రోజూ 2 నుంచి 3 లోక్‌ సభ నియోజకవర్గాల సమీక్షలు చేస్తారు. మధ్యలో 5 రోజులు సమావేశాలుండవు. ఒక శనివారం - 2 ఆదివారాలు విరామం ఇస్తున్నారు.

ఇంకోమాట ఇదే సమయంలో ఆయన పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ తరఫున ప్రచారానికి కూడా వెళ్లబోతున్నారు. మే 7 - 8 తేదీల్లో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముంది. సమీక్షా సమావేశాలు రోజూ ఉదయం 9 - 10 గంటలకే మొదలవుతాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మొదట చంద్రబాబు ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులనుద్దేశించి ప్రసంగిస్తారు. భోజన విరామం అనంతరం ఆయా శాసనసభ నియోజకవర్గాల నాయకులతో సమీక్షా సమావేశాలు జరుగుతాయి.

లోక్‌ సభ నియోజకవర్గాల వారీ సమీక్షలకు ముందుగా మే 1న సీబీఎన్‌ ఆర్మీ - తెదేపా ఎన్ ఆర్ ఐ విభాగం ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమవుతారు. లోక్‌ సభ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగిశాక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే పార్టీ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికైతే చంద్రబాబుకు ఒక పదిహేను రోజుల పాటు పండగే పండగన్నమాట.