ఇబ్బంది: ఆ విషయం బాబుకు కూడా తెలిసిపోయింది
By: Tupaki Desk | 22 April 2015 4:31 AM GMTఆంధ్రప్రదేశ్ విభజన అంశం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఇబ్బందిపెట్టినంతగా మరెవరినీ పెట్టి ఉండక పోవచ్చు. అయితే విభజన తర్వాత రాష్ర్టం ఏర్పడి నవ్యాంధ్రప్రదేశ్ పాలన పగ్గాలు అనుభవుజ్ఞుడనే కోణంలో చంద్రబాబుకు కట్టబెట్టినప్పటికీ ఆయనకు ముళ్లకిరీటం వలే తిప్పలు తప్పని పరిస్థితి. కేంద్ర విభజన సమయంలో హామీ ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ తదితర విషయాల్లో నోరెత్తడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బహిరంగంగా ప్రత్యేక హోదా దక్కదు అని చెప్పలేనప్పటికీ అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా తెలుగుదేశం ఎంపీలకు ఈ మేరకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
పార్లమెంటు మలివిడత సమావేశాల సందర్భంగా పార్టీ ఎంపీలతో సమావేశమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేలా కనిపించట్లేదని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ప్రత్యేక హోదా స్థాయి ప్యాకేజీని సాధించుకునేందుకు సిద్ధం కావాలని తెలుగుదేశం ఎంపీలకు ఆయన సూచించారు. ఒకపక్క ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇవ్వకపోవచ్చుననే సంకేతాలే ఎక్కువగా ఉన్నాయని చంద్రబాబు ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంటుల రూపంలో వస్తాయని, ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా అదే స్థాయిలో.. లేదంటే 70 శాతానికి తగ్గకుండా నిధులు సాధించేందుకు సిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు. ఇలా ప్రత్యేక హోదా దక్కకపోయినా రాష్ర్టానికి ఏ విధంగా మేలు కలిగించుకోవాలో దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పనులకు కేంద్రం నుంచి నిధులు సాధించాలని వారికి సూచించారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ఆయా శాఖల కేంద్ర మంత్రుల్ని కలవాలని వారికి తెలిపారు. ఒకటికి రెండుసార్లు కేంద్ర మంత్రుల్ని కలవటంలో తప్పు లేదని, వాస్తవానికి అలా కలిసి వివరించబట్టే ఆర్థిక సంవత్సరం చివర్లో రావాల్సిన నిధులు విడుదల అయ్యాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధుల్ని విడుదల చేయించుకోవటంలో ఎంపీల చొరవను ప్రశంసించారు. విభజన సందర్భంగా ఇచ్చిన పలు హామీలను ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సి ఉందని.. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బూర్గంపాడు గ్రామ అంశాన్ని పరిష్కరించుకోవాలని తెలిపారు. రాజధానికి నిధులు రాబట్టుకోవాలని, 13వ ఆర్థిక సంఘం బకాయిలు రూ.690 కోట్లు విడుదల కావాల్సి ఉందని గుర్తు చేశారు.