Begin typing your search above and press return to search.

దేశం 'పొత్తు' పొడుపు నేడే

By:  Tupaki Desk   |   8 Sep 2018 4:56 AM GMT
దేశం పొత్తు పొడుపు నేడే
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికల సమరంలో ఎత్తులు... పొత్తులు... వ్యూహాలు... ప్రతి వ్యూహాలకు సమయం ఆసన్నమైంది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కసిగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో లోపాయికారి ఒప్పందముందని ప్రజల్లో అభిప్రాయం ఉన్నా... ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును దించేందుకు ఏం చేయాలా అనే వ్యూహ రచన చేస్తున్నారు. ఇక మిగిలిన చిన్నచితకా పార్టీల లక్ష్యం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడమే. ఇందుకోసం భావసారూప్యం - సిద్ధాంతాల వంటి అంశాలను పక్కన పెట్టి ఏ పార్టీతోనైనా కలిసేందుకు సిద్ధమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఈ పార్టీ కాంగ్రెస్‌ తో చేతులు కలిపేందుకు కూడా సిద్ధమైంది. దీనికి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవమే వేదిక అయ్యింది. దాంతో పాటు విజయవాడలో అమ్మవారి దర్శనంతో పాటు కుమారుడి వివాహ మాటల కోసం వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. దీనికి వెనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించే ఎక్కువ చర్చలు జరిగాయనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు - వారిని ఎన్ని స్ధానాలు అడగాలి... ఏ జిల్లాల్లో అడగాలి వంటి అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి - తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ రద్దుతో పాటు అభ్యర్ధులను ప్రకటించారు. అంతే కాదు... ప్రచార సభను కూడా బాహాటంగా నిర్వహించారు. ఈ సమయంలో త్వరగా పొత్తులు కుదుర్చుకుని అభ్యర్ధులను ప్రకటించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తుల నిర్ణయం తర్వాత అభ్యర్ధులను ప్రకటించుకుని ప్రచారానికి శ్రీకారం చుడుతుందని వారంటున్నారు. దీంతో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే తెలుగుదేశం నాయకుల సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.