Begin typing your search above and press return to search.

మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు అనే బాబు లీకుల షో!

By:  Tupaki Desk   |   21 Feb 2017 6:19 AM GMT
మంత్రుల‌కు హెచ్చ‌రిక‌లు అనే బాబు లీకుల షో!
X
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై విప‌క్షాలు సంగ‌తి ప‌క్క‌న పెడితే సొంత పార్టీ నేత‌లే ప‌క్కున న‌వ్వుకుంటున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. త‌మ‌ది క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని, గీత దాటితే వేటేన‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు ర‌చ్చ‌కెక్కిన వారి విష‌యంలో తీసుకుంటున్న చ‌ర్య‌లేమీ ఉండ‌క‌పోగా ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ఘ‌నంగా ఉన్నాయ‌ని అంటున్నారు. మంత్రులైనా స‌రే క‌ట్టుదాటితే చ‌ర్య‌ల‌ని హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ అవంతా నీటిమీది రాత‌లేన‌ని వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు - గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేధాలపై తాజాగా బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంపై ఈ వ్యాఖ్య‌లు వినిప‌స్తున్నాయి.

ఉండవల్లిలో తన నివాసంలో పార్టీ విశాఖ జిల్లా నేతలతో చంద్ర‌బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వర్గ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‘మిమ్మల్ని భరించలేను.. ఇకనైనా మారండి’ అంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. మంత్రి గంటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. విభేదాల వల్ల పార్టీకి జిల్లాలో నష్టం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే చాలా సార్లు అన్ని రకాలు నచ్చచెప్పినా పరిస్థితిలో మార్పులేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన నేతలే ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కల్గించే రీతిలో వ్యవహరించే వారిని భరించడం ఇక సాధ్యం కాదని తేల్చిచెప్పినట్లు సమాచారం. తనకు పార్టీ చాలా ముఖ్యమని, పార్టీకి ఇబ్బంది కల్గించేవారిపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని సుతిమెత్తగా హెచ్చరించారు.

పార్టీ రాష్ట్ర నేత‌ల‌తో నిర్వ‌హించిన వ‌ర్క్ షాప్ అనంత‌రం ఆయా జిల్లా నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా క్లాసులు తీసుకుంటున్నాఅని ప్ర‌చారం చేస్తున్న సీఎం చంద్ర‌బాబు పార్టీ నేత‌లు క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే వారిపై నిజంగానే ఎందుకు చ‌ర్య తీసుకోవ‌డం లేద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. చ‌ర్య‌లు తీసుకుంటాను అనే ప్ర‌క‌ట‌న కామెడీగా మారిపోవ‌డం వ‌ల్లే పార్టీ నేత‌లు పాత‌దారిలో న‌డుస్తున్నార‌ని కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు బ‌హిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/