Begin typing your search above and press return to search.

యనమలపైనే చంద్రబాబు భారం..అర్ధరాత్రి వరకు చర్చలు!

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:24 AM GMT
యనమలపైనే చంద్రబాబు భారం..అర్ధరాత్రి వరకు చర్చలు!
X
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మంచి కాకమీద ఉంది. ఒకవైపు ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లుపై చర్చ పెట్టి , ఆమోదం తెలుపుతుంటే ..మరోవైపు ప్రతిపక్షం ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఒకే రాష్ట్రం ..ఒకే రాజధాని అన్న నినాదం తో సభలో హోరెత్తిస్తుంది. ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టిన సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసారు. ఇక, అసెంబ్లీలోనూ తమ వైఖరి స్పష్టం చేసారు. అయితే అసెంబ్లీ లో టీడీపీ సంఖ్యా బలం చాలా తక్కువగా ఉండటంతో టీడీపీ అభ్యంతరాలకు విలువ లేకుండా పోయింది. అయితే, శాసన మండలిలో టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో శాసన మండలిలో బిల్లును అడ్డుకుంటామని టీడీపీ ధీమాగా చెబుతోంది.

ఏపీ శాసన మండలి ముందుకు కాసేపట్లో అసెంబ్లీలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లుతో పాటుగా సీఆర్డీఏ రద్దు బిల్లు రానున్నాయి. అయితే, టీడీపీ వీటిని అడ్డుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ సమయంలో మండలిలో పార్టీల వారీగా ఉన్న బలా బలాలు - సంఖ్యా బలం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఏపీ మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా - అందులో మూడు స్థానాలు ప్రస్తుతం ఖాళీ గా ఉన్నాయి. అందులో అధికంగా టీడీపీ కి 28 మంది సభ్యుల మెజార్టీ ఉంది. కాగా, అధికార వైసీపీకి మాత్రం 9 మంది సభ్యులే ఉన్నారు. పీడీఎఫ్ సభ్యులు అయిదుగురు - స్వతంత్రులు ముగ్గురు - ఉండగా బీజేపీ నుండి ఇద్దరు సభ్యులు మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక, నామినేటెడ్ కోటాలో నియమితులైన ఎనిమిది మంది సభ్యుల్లో నలుగురు సభ్యులు టీడీపీకే మద్దతిచ్చే అవకాశం ఉంది.

ఇందులో భాగంగానే మండలిలో ప్రతిపక్షంగా తమకు ఉన్న అవకాశాలు.. బిల్లు విషయంలో వ్యవహరించాల్సిన వ్యూహాల పైన టీడీపీ అధినేత చంద్రబాబు అర్ద్రరాత్రి వరకు పార్టీ నేతలు - ఎమ్మెల్సీలతో మంతనాలు సాగించారు. మండలిలో మొత్తం సభ్యులు హాజరవ్వాలని, పార్టీ నిర్ణయానికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని పార్టీ విప్ జారీ చేసింది. ఇక, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాల బాధ్యతలను సీనియర్ నేత యనమలకు అప్పగించారు. ఆయన సీనియర్ సభ్యుడు కావటంతో పాటుగా గతంలో స్పీకర్ గా పని చేసిన అనుభవం..అదే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రిగా..న్యాయపర అంశాల పైన పట్టు ఉండటంతో ఆయన పాత్ర ఇప్పుడు సభలో టీడీపీ కీలకంగా భావిస్తోంది.

శాసనసభ కంటే భిన్నంగా మండలిలో పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకోవాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటానికి మంత్రులను మండలిలో మొహరిస్తున్నారు. ఇటు టీడీపీ ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయాలని భావిస్తోంది. దీని కారణంగా బిల్లు పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది.అయితే, సీఎం మాత్రం బిల్లు ఆమోదం..లేక తిరస్కరణ అయినా ఇదే రోజు పూర్తి చేయాలని మంత్రులకు నిర్దేశించారు. మండలిలో బిల్లు తిరస్కరణకు గురైనా, తిరిగి బుధవారం శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదించేలా చూడాలని ప్రభుత్వం అంచనాగా కనిపిస్తోంది.