Begin typing your search above and press return to search.

అమరావతికి వేసే ముష్టి కూడా ఇంత దారుణమా?

By:  Tupaki Desk   |   2 July 2016 5:27 AM GMT
అమరావతికి వేసే ముష్టి కూడా ఇంత దారుణమా?
X
అనుకున్నదే అయ్యింది. అడ్డదిడ్డంగా రాష్ట్ర విభజనను చేపట్టి..ముక్కలయ్యే ఏపీకి నిధులు.. ప్రాజెక్టులు.. హామీల మందుపూసినట్లుగా చెప్పిన మాటలన్ని అబద్ధాలన్న విషయం తేలిపోయినట్లే. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకునే విషయంలో పెద్ద హ్యాండ్ ఇచ్చిన కేంద్రం.. తాజాగా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధుల లెక్క కూడా తేలిపోయింది.

దేశ రాజధాని ఢిల్లీ కంటే మిన్నగా అమరావతిని నిర్మిస్తామంటూ చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తి కబుర్లేనని తేలిపోయింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి కేంద్రం అందించే సాయం గురించి లెక్క చెప్పేశారు. చైనా పర్యటనను ముగించుకొని వచ్చిన చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో పాటు.. పలువురు మంత్రుల్ని కలిశారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణానికి మొత్తంగా రూ.2500 కోట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు చెప్పారని.. ఇందులో ఇప్పటికే వెయ్యి కోట్లు ఇచ్చేసినట్లుగా చెబుతున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు.

గతంలో విజయవాడ.. గుంటూరు నగరాలకు ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల లెక్కను కూడా అమరావతి ఖాతాలోకి కేంద్రం వేసిందని చంద్రబాబు వెల్లడించారు. ఇక.. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చేది రూ.1500 కోట్లు మాత్రమేనని తేల్చేరు. కేంద్రం ఇచ్చే రూ.1500 కోట్లు రాజధానిలో తాము కట్టే 400 కేవీ టవర్స్ నిర్మాణానికే సరిపోతుందని బాబు చెప్పుకొచ్చారు.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కాసిన్ని నీళ్లు.. మట్టి తెచ్చినప్పుడే తన వైఖరిని మోడీ తేల్చేసినట్లుగా అప్పుడు అందరూ అనుకున్నారు. అయితే.. మోడీ మాటల్లో చెప్పకుండా చేతల్లో ఏపీకి సాయం చేస్తారని కవర్ చేస్తూ కొందరు మాటలు చెప్పినా.. అవేమీ నిజాలు కావన్న విషయం తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాటలతో తేలిపోయిందని చెప్పాలి.

విభజన కారణంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో పడిన ఏపీకి.. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్రం కనీసం రూ.25వేల కోట్లు అయినా దశల వారీగా ఇస్తుందన్న ఆశ కూడా ఇకపై లేనట్లే. అమరావతికి ఇచ్చే నిధుల విషయంలో కేంద్రం వైఖరి స్పష్టమైన నేపథ్యంలో.. అమరావతికి కోసం మోడీ ముష్టి కూడా సరిగా వేయలేదని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఇప్పుడున్న అంచనాల ప్రకారం అమరావతి మహా నగరాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్లు అవసరం. ఇంత మొత్తం కేంద్రం భరించకున్నా.. ఈ ఖర్చులో కేంద్రం ఇచ్చేది రూ.2500 కోట్లు మాత్రమే అంటే.. దాన్ని ముష్టి అనకుండా ఇంకేం అనలేం కదా..?