Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు!... కాంగ్రెస్‌ నూ క‌లిశార‌హో!

By:  Tupaki Desk   |   3 April 2018 9:56 AM GMT
ఢిల్లీలో బాబు!... కాంగ్రెస్‌ నూ క‌లిశార‌హో!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఇప్పుడు సాగుతున్న ఉద్య‌మం దాదాపుగా తారా స్థాయికి చేరుకుంద‌నే చెప్పాలి. ఇంకో మూడు రోజులుంటే పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు ముగియ‌నున్నాయి. అప్ప‌ట్లోగా ఏపీకి న్యాయం చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల కాక‌పోతే... త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసేస్తామ‌ని వైసీపీ లోక్ స‌భ స‌భ్యులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న ఈ సంచల‌న నిర్ణ‌యంతో హోదా పోరు నిజంగానే తారాస్థాయికి వెళ్లింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయడంతో పాటుగా ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ఏకంగా నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌కు దిగుతామ‌ని కూడా వైసీపీ ఎంపీలు చేసిన ప్ర‌క‌ట‌నతో ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ టీడీపీ - ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో మొన్న‌నే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు రావాల్సిన చంద్ర‌బాబు... వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని చూసిన‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. అయితే ఓ రెండు గంటలు ఆల‌స్యంగానైనా చంద్ర‌బాబు ఢిల్లీలో అడుగుపెట్ట‌క త‌ప్ప‌లేదు. నేటి ఉద‌యం ఢిల్లీలో ల్యాండైన చంద్ర‌బాబు... నేరుగా పార్ల‌మెంటుకు వెళ్లారు. అక్క‌డ త‌మ పార్టీ ఎంపీల నుంచి గ్రాండ్ వెల్ క‌మ్ అందుకున్న‌చంద్ర‌బాబు... పార్ల‌మెంటు ఆవర‌ణ‌లోని మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి నివాళి అర్పించారు. ఆ త‌ర్వాత త‌న పార్టీ ఎంపీలు వెంట‌రాగా.. పార్ల‌మెంటులోకి ప్ర‌వేశించిన చంద్ర‌బాబు... పార్ల‌మెంటులో అందుబాటులో ఉన్న వివిధ పార్టీల ఎంపీల‌ను క‌లిశారు. చంద్ర‌బాబుతో భేటీకి ఆయా పార్టీల నేత‌ల‌ను ఒప్పించ‌డంలో టీడీపీ ఎంపీలు ఒకింత మేర స‌ఫ‌ల‌మైన‌ట్లుగానే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు ఏఏ పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను క‌లిశార‌న్న వియానికి వ‌స్తే... పార్ల‌మెంటులో అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీ ఎంపీలు ప్ర‌తిపాదించిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎంపీల‌ను బాబు క‌లిసిన‌ట్లుగా స‌మాచారం. మ‌నమంతా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వార‌మ‌ని, మ‌న స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే అడ్డుకుంటే ఎలాగన్న రీతిలో... ఇకనైనా అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చేలా స‌హ‌క‌రించాల‌ని చంద్ర‌బాబు వారికి విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లుగా స‌మాచారం.

ఆ త‌ర్వాత మ‌రింత ముందుకు సాగిన చంద్ర‌బాబు... నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత - జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా - కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా - టీఆర్ ఎస్ ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి - కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ - రాజీవ్ సాతీవ్ - టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ లను కలిసి చర్చించారు. ఆ త‌ర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రంపై తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఏపీకి అండగా ఉండాలని ఆయ‌న‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీ సుప్రియా సూలే - కాంగ్రెస్ ఎంపీ సచిన్ పైలట్‌ లను కూడా చంద్రబాబు కలిసి చర్చించారు. వీరితోపాటు తారిక్‌ అన్వర్‌ - అనుప్రియ పటేల్‌ - హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ లను కలిశారు. మొత్తంగా త‌న‌కు చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల‌తో చంద్ర‌బాబు భేటీ కాక త‌ప్ప‌లేదు. ఈ భేటీల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.