Begin typing your search above and press return to search.

కంకణాలు విప్పిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   24 April 2019 8:44 AM GMT
కంకణాలు విప్పిన చంద్రబాబు
X
రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారపర్వాన్ని భుజానికి ఎత్తుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. తన నియోజకవర్గమైన కుప్పం బాధ్యతను మాత్రం తనకు ఎంతో నమ్మకమైన నేతలు - కార్యకర్తల చేతుల్లో పెట్టారు. ఏపీ వ్యాప్తంగా బాబు ప్రచారం చేసి టీడీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. తను పోటీచేస్తున్న నియోజకవర్గం కుప్పం బాధ్యతను మాత్రం తనకు నమ్మకస్తులైన టీడీపీ నేతలకు అప్పగించారు.

*కంకణాల కథ ఏంటి.?

ఎన్నికలు జరిగిన ఏప్రిల్ 11కు సరిగ్గా రెండు నెలల ముందు అమరావతికి కుప్పం టీడీపీ ముఖ్యనాయకులను బాబు రప్పించాడు. కుప్పం జడ్పీటీసీ రాజ్ కుమార్ - ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్రశేఖర్ సహా కీలక నేతలు వచ్చి బాబును కలిశారు. ఈ సందర్భంగా బాబు అప్పుడే తాను కుప్పంలో ఎక్కువ ప్రచారం చేయనని.. తన గెలుపు బాధ్యతను తీసుకోవాలని నాయకులను కోరారు. దీనికి సదురు నాయకులు గెలిపిస్తామని ప్రతినబూనారు. దీంతో బాబు వారికి కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా ‘ఎన్నికల దీక్షా కంకణాలను’ స్వయంగా కట్టారు. ప్రజల్లో ఉండి వారి కష్టాసుఖాల్లో పాలుపంచుకోవాలని.. అధిక మెజారిటీ కోసం కుప్పంలో కృషి చేయాలని కోరుతూ బాబు వారికి దిశానిర్ధేశం చేశారు.

*రెచ్చిపోయి ప్రచారం చేసిన నేతలు

బాబు కట్టిన దీక్షా కంకణాలతో తిరిగివచ్చిన కుప్పం టీడీపీ నేతలు తర్వాత ఎన్నికల యుద్ధంలో శ్రమించారు. ఒక వైపు పార్టీ కార్యక్రమాలు - మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో దూసుకుపోయారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమై వారికి ఏం కావాలో తెలుసుకొని.. బాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నింటినీ తీర్చారు. అది ఎన్నికల్లో ప్రతిఫలించింది.

*అత్యధిక పోలింగ్ చేయించిన నేతలు

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో 82.25శాతం పోలింగ్ నమోదైంది. అర్దరాత్రి దాకా క్యూలైన్లో నిలబడి జనాలు ఓటేశారు. అదంతా టీడీపీ అనుకూల ఓటింగ్ అని బాబుకు రిపోర్ట్స్ రావడంతో చంద్రబాబు హ్యాపీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ తన గెలుపు కోసం కృషి చేసిన తెలుగు తమ్ముళ్లను బాబు అమరావతికి రప్పించి మరీ ఈరోజు అభినందించారు. అంతేకాకుండా తను కట్టిన ఎన్నికల దీక్షా కంకణాలను బాబే విప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రీతిన పనిచేయాలని మీకే టికెట్లు ఇస్తానంటూ వారికి హామీనిచ్చారు.