Begin typing your search above and press return to search.

బాబుతో రాష్ట్రపతి అన్న మాటలూ బయటకొచ్చేశాయ్

By:  Tupaki Desk   |   11 Nov 2016 4:27 AM GMT
బాబుతో రాష్ట్రపతి అన్న మాటలూ బయటకొచ్చేశాయ్
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారితో ప్రత్యేకంగా భేటీ అయినప్పుడు జరిగే సంభాషణలు చాలా అరుదుగా బయటకు వస్తుంటాయి. రాష్ట్రపతితో తెలుగు ప్రాంతానికి చెందిన నేతలు పలు సందర్భాల్లో కలుస్తుంటారు. ఆ సందర్భంగా అధికారికంగా వారు చెప్పే మాటలే తప్పించి.. అంతకు మించిన సమాచారం బయటకు రాదు. అదేం చిత్రమో కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసినప్పుడు మాత్రం.. ఆయనతో అన్న మాటలు మాత్రం ‘‘విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం’’ అని కానీ లేదంటే.. ‘‘తెలిసింది’’ అన్న పేరిట వచ్చేయటం కనిపిస్తుంది. ఇలా వచ్చిన సమాచారంలో బాబుకు కాంప్లిమెంట్లుగా ఇచ్చేవిగా ఉండటం మర్చిపోకూడదు.

తాజాగా తన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ రాజధాని అమరావతిలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరు కావాలని కోరేందుకు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి.. చంద్రబాబుల మధ్య జరిగిన సంభాషణ ‘‘తెలిసింది’’ పేరిట బయటకు వచ్చింది.

అలా వచ్చిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఏపీ ప్రజలు మంచి పని చేశారని.. కలిసి ఉంటే నిత్యం కీచులాటలతోసరిపోయేదని.. సొంత కాళ్లపై నిలబడి.. అభివృద్ధి చెందే అవకాశం వచ్చిందని చంద్రబాబుతో రాష్ట్రపతి ప్రణబ్ చెప్పినట్లుగా వార్తలు రావటం గమనార్హం. ఈ సందర్భంగా కొత్త రాజధాని నిర్మాణంలో బాబు బాగా పని చేస్తున్నట్లుగా కితాబు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానాల్లో ఉండే వారిని కలిసినప్పుడు.. వారు ప్రైవేటు సంభాషణల్లో చేసే వ్యాఖ్యల్ని వార్తల రూపంలో బయటకు రావు. కానీ.. బాబు ఇమేజ్ పెంచేలా వార్తలు రావటం ఒక ఎత్తు అయితే.. ‘‘తెలిసింది’’ పేరిట బాబు ఇమేజ్ పెంచే ప్రయత్నంగా కొన్ని వార్తలు అచ్చు కావటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/