Begin typing your search above and press return to search.

'దేశం' అంత్యక్రియ‌లు ముగిసాయి !

By:  Tupaki Desk   |   1 Nov 2018 4:26 PM GMT
దేశం అంత్యక్రియ‌లు ముగిసాయి !
X
స‌మైక్య రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకి అంత్యక్రియ‌లు ముగిసాయి. అదేంటి...అంత్యక్రియ‌లు అంటున్నారేమిటి. ఆ పార్టీ ఇంకా జాతీయ పార్టీయే క‌దా అంటారా - కావ‌చ్చు... కాని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.... తెలుగు వారి ఆత్మ గౌర‌వానికి ప్రతీక‌గా పుట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో జ‌త క‌ట్టడంతోనే ఆ పార్టీ మ‌ర‌ణించిన‌ట్లేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. మూడున్నర ద‌శాబ్దాల క్రితం మ‌హాన‌టుడు ఎన్.టి.రామారావు తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని కాపాడ‌డంలో భాగంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఢిల్లీలో తెలుగు వారికి క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు లేకుండా చేస్తున్నార‌ని ఆగ్రహించిన అన్నగారు తెలుగుదేశం పార్టీ స్ధాపించి కాంగ్రెస్ పార్టీని మూడు చెరువులు నీళ్లు తాగించారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగా త‌న మామ మీదే పోటీ చేస్తానంటూ బీరాలు ప‌లికారు. ఆ త‌ర్వాత కొన్నాళ్లకు మామ పంచ‌న చేరిన చంద్రబాబు నాయుడు పార్టీలో ఎదుగుతూ చివ‌రకు పార్టీని స్థాపించిన ఎన్.టి.రామారావునే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని - పార్టీని కూడా లాక్కున్నారు. తెలంగాణ‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితిని - కేంద్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌ద్దె దించేందుకు తెలుగు వారి ఆత్మగౌర‌వ ప్రతీక‌గా ఇన్నాళ్లు నిలిచిన తెలుగుదేశం పార్టీని మాత్రం చంద్రబాబు నాయుడు నిలువునా ముంచుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులే కాదు.... తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కులు సైతం త‌మ స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నారు.

భారతీయ జనతా పార్టీకీ... చంద్రబాబు నాయుడికి మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఓ చారిత్రక అవసరంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని ఇలా కాంగ్రెస్ తో కలిసేలా చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరని అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడే ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారని - కాంగ్రెస్ తో కలిస్తే భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరనే వాదనలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడి వైఖరితో భారతీయ జనతా పార్టీతో వ్యక్తిగత వైరంగా మారిందని - దీన్ని పార్టీకి - ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముడిపెట్టడం తప్పు అనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే అక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాలి కాని కాంగ్రెస్ పార్టీతో కలవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చారిత్రక తప్పిదమే అనే అంటున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వారే చెబుతున్నారు. "మూడున్నర దశాబ్దాల పాటు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడం. ఇప్పుడు వారితో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఎలా తిరుగుతాం" అని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. మొత్తానికి నవంబర్ 1 వ తేదీ తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పిద రోజుగా మిగిలిపోతుందని వాదనలు వస్తున్నాయి.