Begin typing your search above and press return to search.

జైట్లీకి బాబు 'ప్రత్యేక' విందు.. ఎందుకు?

By:  Tupaki Desk   |   28 Oct 2016 11:11 AM GMT
జైట్లీకి బాబు ప్రత్యేక విందు.. ఎందుకు?
X
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా రాబోతుందనటానికి కారణం ఎవరు అనగానే... వెంకయ్య నాయుడు అని వినిపించేది. అనంతరం కూర్చీలు ఎక్కేసిన తర్వాత - ప్రజలకు ఇచ్చిన మాట తప్పేసే క్రమంలో... ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వెనుక ప్రధాన కారణం ఎవరని అడిగితే మొట్టమొదట వినిపించే పేరు అరుణ్ జైట్లీ! అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు - వెంకయ్యనాయుడు - మన ఎంపీల పనితనం కాసేపు పక్కనపెడితే... కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ఈ విషయంలో ఏపీకి హోదా రాకుండా అడుగడుగునా అడ్డంపడ్డారని అన్ని పార్టీల నేతలు చెబుతుంటారు! దీంతో బీజేపీ నేతలపైనా - టీడీపీ నేతలపైనా ఏపీ ప్రజలకు కారాలూ మిరియాలూ నూరేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన జైట్లీకి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు "ప్రత్యేక" విందు ఇచ్చారు.

అమరావతిలో శంకుస్థాపనలకు వచ్చిన అరుణ్ జైట్లీని వెంకయ్య నాయుడు పొగడ్తలకే పూనకం వచ్చే స్థాయిలో పొగిడేస్తే... చంద్రబాబు వెరైటీ వంటకాలతో విందు ఇచ్చారు. ఈ క్రమంలో జైట్లీ అడుగులకు చంద్రబాబు - వెంకయ్యనాయుడులు మడుగులొత్తడంలో పోటీపడ్డారనే కామెంట్లూ వినిపించాయి!! విజయవాడలోని హోటల్ గేట్ వే లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతమైన విందు ఇచ్చారు. నోరూరించే సుమారు 50 రకాల వంటకాలతో ఈ విందు ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రత్యేక హోదా ఇవ్వనందుకా - లేక ప్రత్యేక ప్యాకేజీ అని దెబ్బకొట్టినందుకా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... అరుణ్ జైట్లీకి అమిత ఇష్టమైన బెండి ఆమ్ చూర్ తో పాటు ఏపీ స్పెషల్ ఉలవచారు - గోంగూర పచ్చడి - గోంగూర మటన్ - పీతల కూర - టైగర్ ప్రాన్స్ - అరటి ఆకుల్లో పత్రి ఫిష్ - నాటు కోడి పులుసు - నెల్లూరు చేపల పులుసు - గారెలు - రాయలసీమ స్పెషల్ రాగి సంకటి - షుగర్ ఫ్రీ జున్ను - పూతరేకులు - బొబ్బట్లు తదితర వంటకాలతో "ప్రత్యేక" విందు ఇచ్చారు చంద్రబాబు.

ఏది ఏమైనా హోదా ను సక్సెస్ ఫుల్ గా అటకెక్కించినందుకో ఏమో కానీ... మన నాయళ్లిద్దరూ కేంద్రమంత్రి జైట్లీని మర్యాదకే అసూయ కలిగేటంత మర్యాదగాగా చూసుకున్నారు. ఎంతైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీతో సరిపెట్టారుకదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/