Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు హోదా దీక్ష‌!... సీఎం హోదాలోనేన‌ట‌!

By:  Tupaki Desk   |   8 Feb 2019 6:42 AM GMT
ఢిల్లీలో బాబు హోదా దీక్ష‌!... సీఎం హోదాలోనేన‌ట‌!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో చేయ‌త‌ల‌పెట్టిన దీక్ష‌కు కూడా ప్ర‌జా ధ‌నాన్నే వెచ్చించేందుకు రంగం సిద్ధ‌మైపోయింది. ఇప్ప‌టికే ధ‌ర్మ పోరాట దీక్ష‌లు - న‌వ నిర్మాణ దీక్ష‌లంటూ విచ్చ‌ల‌విడిగా ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చించిన చంద్ర‌బాబు స‌ర్కారు... దాని నుంచి పైసా వంతు ప్ర‌యోజ‌నం కూడా రాబ‌ట్ట‌లేక‌పోగా... మ‌రింత‌గా ప్ర‌జాధ‌నాన్ని మంచి నీళ్ల‌లా ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మైపోయింది. అయినా ఢిల్లీలో చేప‌ట్ట‌నున్న దీక్ష ద్వారా కించిత్ ప్ర‌యోజ‌నం కూడా ద‌క్క‌ద‌ని తెలిసినా కూడా త‌న సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకునేందుకు - వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌ను తీర్చుకునేందుకే టీడీపీ ఈ దీక్ష‌కు తెర తీసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన చంద్ర‌బాబు... ప్ర‌త్యేక హోదా వ‌ద్దు - ప్ర‌త్యేక ప్యాకేజీ ముద్దు అంటూ మోదీ స‌ర్కారుకు వంత పాడిన విష‌యం తెలిసిందే.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ త‌ర‌హా వైఖ‌రితో ప‌ని కాద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు... వెంట‌నే యూట‌ర్న్ తీసుకున్నారు. అప్ప‌టిదాకా కేంద్రంలో తానూ భాగ‌స్వామిగా కొన‌సాగిన టీడీపీ... తిరిగి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదని పేర్కొంటూ బీజేపీకి దూరంగా జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు తెర తీశారు. ఈ క్రమంలో విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన తొలి ధ‌ర్మ‌పోరాట దీకు ఏకంగా రూ.30 కోట్ల‌కు పైగానే ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చించేశారు. ఆ త‌ర్వాత జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష‌ల పేరిట బాబు ప్ర‌భుత్వం ప్ర‌జా ధ‌నాన్నిమంచి నీళ్ల‌లానే ఖ‌ర్చు చేసిందని చెప్పాలి. తాజాగా ఢిల్లీ వేదిక‌గా చంద్ర‌బాబు దీక్ష‌కు చాలా వ్యూహాత్మ‌కంగానే ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఈ దీక్ష‌కు ప్ర‌జా ధ‌నంతో ఏమేం చేయొచ్చో అన్నింటినీ చాలా ప్లాన్డ్‌గా చేస్తూ ముందుకు సాగుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు... ఒక్కొక్క‌టిగా అంశాల‌ను వెల్ల‌డిస్తూ... త‌న‌కు అడ్డంకులు ఎదురు కాకుండా చూసుకుంటోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఢిల్లీలో దీక్ష అంటే... అంద‌రికీ జంత‌ర్ మంత‌రే గుర్తుకు వ‌స్తుంది. అయితే దీక్ష చేస్తున్న‌ది చంద్ర‌బాబు క‌దా... జంతర్ మంత‌ర్ కాకుండా ఏకంగా ఏపీ భ‌వ‌న్ ను వేదిక‌గా నిర్ణ‌యించారు. చంద్ర‌బాబు సీఎం హోదాలోనే దీక్ష చేస్తున్నార‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఈ దీక్ష‌కు జ‌న స‌మీక‌ర‌ణ‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం ఏపీ నుంచి ఢిల్లీ దాకా రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపేస్తార‌ట‌. ఈ రైళ్లు జ‌నాల‌ను ఏపీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లి.. దీక్ష ముగిసిన త‌ర్వాత వారిని తిరిగి తీసుకుని వ‌స్తాయ‌ట‌. ఇలా రెండు రైళ్ల ద్వారా ఓ 1,500 మందిని ఏపీ నుంచి త‌ర‌లించేసి - ఢిల్లీలో మ‌రో 3 నుంచి 4 వేల మందిని స‌మీక‌రించాల‌ని చూస్తున్నారట‌. మ‌రి ఇందుకోసం ఏ మేర ఖర్చు చేయ‌నున్నారో చూడాలి. ఇక బాబు దీక్ష ఎప్ప‌టినుంచి ఎప్ప‌టి వ‌ర‌కు సాగుతుంద‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ నెల 11న ఉద‌యం 11 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు బాబు దీక్ష‌లో కూర్చుంటార‌ట‌. అంటే... దీక్షా వేదిక‌పై చంద్ర‌బాబు 10 గంట‌ల పాటు మాత్ర‌మే కూర్చుంటార‌ట‌. అంటే అర రోజు కంటే క‌కూడా త‌క్కువేన‌న్న మాట‌.

ఈ మాత్రం దీక్ష‌కు బాబు స‌ర్కారు ఎంత‌లేద‌న్నా... మ‌రో 15 నుంచి 20 కోట్ల మేర‌కు ప్ర‌జా ధ‌నాన్ని వెచ్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. పార్ల‌మెంటు స‌మావేశాలు ముగుస్తున్న స‌మ‌యంలో ఈ దీక్ష‌తో రాష్ట్రానికి ఏం ఒరుగుతుంద‌న్న విష‌యంపై బాబు అండ్ కో నుంచి అస‌లు స‌మాధాన‌మే రావడం లేదు. దీక్ష ముగిసిన త‌ర్వాత రాత్రంతా రెస్ట్ తీసుకునే చంద్ర‌బాబు... ఆ మ‌రునాడు అంటే ఈ నెల 12న రాష్ట్రప‌తిని క‌లిసి విన‌తి ప‌త్రం ఇస్తార‌ట‌. ఇదిలా ఉంటే.. ఈ దీక్ష‌కు భావ‌సారూప్యం క‌లిగిన పార్టీల‌ను ఆహ్వానిస్తార‌ట‌. చివ‌ర‌గా ఈ దీక్ష గురించిన ఆస‌క్తిక‌ర అంశాన్ని మాత్రం త‌ప్ప‌నిస‌రిగా చెప్పుకోవాల్సిందే. అదేంటంటే... చంద్ర‌బాబు మాత్రం సీఎం హోదాలోనే ఈ దీక్ష‌కు వెళుతూ సింగిల్ పైసా జేబులో నుంచి తీయ‌కున్నా... ఆయ‌న దీక్ష‌కు సంఘీభావంగా వెళ్లాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రం సొంత ఖర్చుల‌తోనే హ‌స్తిన‌కు వెళ్లాల‌ని చంద్రబాబు తీర్మానించేశారు.