Begin typing your search above and press return to search.

ఏందిది బాబు..? భ‌ద్ర‌త మీద హైకోర్టుకా?

By:  Tupaki Desk   |   2 July 2019 5:28 AM GMT
ఏందిది బాబు..? భ‌ద్ర‌త మీద హైకోర్టుకా?
X
కొన్ని విష‌యాల మీద ఆస‌క్తి చూపించ‌కూడ‌దు. ప్ర‌జా సంక్షేమం మీదా..ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మీద‌నే దృష్టి ఉన్న అధినేత ఎలా ఉండాలి? తాను న‌ష్ట‌పోతున్నా ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల కోసం పోరాడేత‌త్త్వం పుష్క‌లంగా ఉంద‌న్న ఫీలింగ్ క‌లిగించాలి. అదేం సిత్ర‌మో కానీ.. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా త‌న ఇండ‌స్ట్రీ గురించి అదేప‌నిగా గొప్ప‌లు చెప్పుకునే చంద్ర‌బాబుకు.. భ‌ద్ర‌త మీద అంత యావ ఏమిటో ఒక ప‌ట్టాన అర్థం కాదు.

ప్ర‌జ‌లు రిజెక్ట్ చేసి ప‌క్క‌న పెట్టేసిన వేళ‌.. వీలైనంత‌వ‌ర‌కూ త‌న‌కు అధికారం.. హోదా లాంటివి ప‌ట్ట‌వ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌భుత్వం త‌న సెక్యురిటీ త‌గ్గిస్తే.. స‌ర్లే అంటూ.. ఉన్న సెక్యురిటిని తిప్పి పంపాలి. ప్ర‌జ‌ల‌తో నేరుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేయాలి. ప్ర‌జ‌ల్లో మ‌మేకం కావ‌టంపై దృష్టి పెట్టాలి. కానీ.. ఇలాంటివేమీ చేయ‌ని చంద్ర‌బాబు త‌న‌కు త‌గ్గించిన భ‌ద్ర‌త మీద హైకోర్టును ఆశ్ర‌యించిన తీరు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

ఎంత‌సేప‌టికి నేనూ.. నా అవ‌స‌రాలు.. నా గుర్తింపు.. నా ప్ర‌యోజ‌నాలు అన్న‌ట్లే కానీ ప్ర‌జాకోణంలో మాట్లాడ‌టం బాబుకు చేత‌కాదా? అన్న సందేహం క‌లిగేలా ఆయ‌న తీరు ఉంద‌ని చెప్పాలి. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు తొలిసారి రాసిన లేఖ‌లో ప్ర‌జావేదిక‌ను త‌న‌కు కేటాయించాల‌న్న వ్య‌క్తిగ‌త రిక్వెస్ట్ త‌ప్పించి.. ప్ర‌జ‌ల కోసం ఇదే చేయాలి మ‌హా ప్ర‌భు అన్న మాట వ‌చ్చింది లేదు.

ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు కేటాయించే భ‌ద్ర‌త‌ను విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఉండ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చూస్తూ.. చూస్తూ.. రూల్ బుక్ ను బ్రేక్ చేసే సాహ‌సం ఏ పోలీసు ఉన్న‌తాధికారి చేయ‌రు. ఒక‌వేళ చేస్తే న‌ష్టం వారికే త‌ప్పించి బాబు లాంటోళ్ల‌కు ఉండ‌దు. త‌గ్గించిన భ‌ద్ర‌త‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌జ‌ల్లో క‌లిసి పోతే వ‌చ్చే మైలేజీ ఎంతో. అందుకు భిన్నంగా త‌న హంగు ఆర్భాటం ప్ర‌ద‌ర్శించుకోవ‌టానికి భ‌ద్ర‌త కావాలంటూ అదే ప‌నిగా యాగీ చేయ‌టం వ‌ల్ల ప్ర‌జ‌ల్లో చుల‌క‌న‌తో పాటు.. ఒకింత వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

త‌న‌కున్న జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త గురించి అదే ప‌నిగా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి మాట్లాడటం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. గ‌తంలో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది లెక్క‌ల్ని చెబుతూ.. ప్ర‌స్తుతం ఉన్న భ‌ద్ర‌తా సిబ్బంది గురించి వాపోవ‌టంలో ఏమైనా అర్థం ఉందా? అన్న మాట వినిపిస్తోంది. త‌న‌కు త‌గ్గించిన భ‌ద్ర‌త గురించి కోర్టుకు వెళ్లే క‌న్నా.. అదేదో ప్ర‌జాక్షేత్రంలో తిరిగితే ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఆ చిన్న విష‌యం కూడా అంత పెద్ద బాబుకు ఎందుకు అర్థం కాద‌బ్బా?