Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు కేబినెట్...కిచిడీ బ్యాచ్చేనండోయ్‌!

By:  Tupaki Desk   |   3 April 2017 5:08 AM GMT
చంద్ర‌బాబు కేబినెట్...కిచిడీ బ్యాచ్చేనండోయ్‌!
X
టీడీపీ అధినేత‌. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు న‌వ్యాంధ్ర‌లో ఏర్పాటు చేసిన కేబినెట్... నిన్న‌టిదాకా రెండు పార్టీల స‌భ్యుల వ‌ర‌కే ప‌రిమితం. తాజాగా నిన్న చేప‌ట్టిన కేబినెట్ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌తో ఆ కేబినెట్ కాస్తా... కిచిడీ కేబినెట్‌ గా మారిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ వ్య‌తిరేక మీడియా కాకుండా... అనుకూల మీడియానే ప్ర‌చారం చేసుకుంటుండ‌టం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం. బాబు కేబినెట్‌ లో ప్ర‌స్తుతం 26 మంది మంత్రులుండ‌గా... వారిలో 20 మంది మాత్ర‌మే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. మిగిలిన ఆరుగురిలో ఇద్ద‌రు మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన వారు కాగా... న‌లుగురు విప‌క్షం వైసీపీకి చెందిన స‌భ్యులు. నిన్న‌టి విస్త‌ర‌ణ‌లో భాగంగా వైసీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిల‌ప్రియ‌ - ఆదినారాయ‌ణ‌రెడ్డి - సుజ‌య‌కృష్ణా రంగారావు - అమ‌ర్‌ నాథ రెడ్డిల‌కు ప‌ద‌వులు దక్కాయి. ఇక తాను సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాడే బీజేపీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్‌ - పైడికొండ‌ల మాణిక్యాల‌రావుల‌కు ప‌ద‌వులు ద‌క్కిన విష‌యం తెలిసిందే.

తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు.. ఆ త‌ర్వాత ఏపీలో తానే స్వ‌యంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు తెర తీశారు. టీడీపీ నుంచి అందిన తాయిలాల‌కు లొంగిపొయిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు విడ‌త‌ల‌వారీగా టీడీపీలో చేరిపోయారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో వైసీపీ బ‌లం 46కు ప‌డిపోగా... అధికార టీడీపీ బ‌లం మాత్రం ఆమాంతంగా పెరిగిపోయింది. అయితే ఈ లెక్క‌ను టీడీపీ ఎక్క‌డ కూడా బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పుకునే ధైర్యం చేయ‌లేదు. ఎందుకంటే... అలా చెప్పుకుంటే... పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన 21 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు ప‌డితే... ఆ స్థానాల‌కు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ చేతిలో టీడీపీకి చావు దెబ్బ త‌ప్ప‌దు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు స‌ర్కారు... జంపింగ్ ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌నీయ‌కుండా జాగ్ర‌త్త‌గా పావులు క‌దుపుతోంద‌న్న వాద‌న లేక‌పోలేదు.

చంద్ర‌బాబు ఆదేశానుసార‌మే... ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌ల విష‌యంలో అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తాత్సారం చేస్తున్నార‌న్న వాద‌న‌లోనూ నిజం లేక‌పోలేద‌న్న విశ్లేష‌ణ‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకేనేమో... మొన్న అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన నేప‌థ్యంలో ఆయా పార్టీల బ‌లాబ‌లాను ప్ర‌క‌టించిన కోడెల‌... వైసీపీ బ‌లాన్ని 66గానే చెప్పుకొచ్చారు. మ‌రి పార్టీ మారిన వారంతా కూడా వైసీపీకి చెందిన వారే అయిన‌ట్లు స్పీక‌ర్ ఒప్పుకున్న‌ట్టేగా. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ... ఎల్లో మీడియాకు చెందిన ఓ ప్ర‌ధాన ప‌త్రిక నేటి త‌న సంచిక‌లో చంద్ర‌బాబు కేబినెట్‌ను... ఆల్‌ పార్టీ కేబినెట్‌ గా అభివ‌ర్ణిస్తూ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అంతేకాకుండా... చంద్ర‌బాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించార‌ని విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వాద‌న‌కు బ‌లం చేకూర్చేలా ఆ ప‌త్రిక క‌థ‌నం ఉందన్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ క‌థ‌నం చంద్ర‌బాబు కంట ప‌డిందో, లేదో చూడాలి. ఒక‌వేళ ఆ క‌థ‌నం... త‌న కంట‌బ‌డితే... బాబు ఎలా స్పందిస్తార‌న్న అంశంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/