Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌ లో బాబు కొత్త ఇల్లు సూప‌ర్‌

By:  Tupaki Desk   |   6 April 2017 5:25 AM GMT
హైద‌రాబాద్‌ లో బాబు కొత్త ఇల్లు సూప‌ర్‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైద‌రాబాద్‌ లో నిర్మించిన ఇళ్లు పూర్త‌యింది. ఈనెల 9న కొత్తగా నిర్మించిన గృహంలో అడుగు పెడుతున్నారు. ఈ ఇంట్లో అత్యాధునిక స‌దుపాయాల‌న్నీ ఉన్న‌ట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు సమీపంలో చంద్రబాబుకు ఉన్న పాత నివాసాన్ని నేలమట్టం చేసి ఆ స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాణ పనులన్నీ పూర్తి కావడంతో ఈనెల 9న ఉదయం 9.15 గంటలకు గృహ ప్రవేశం జరపాలని వేదపండితులు ముహూర్తాన్ని ఖరారు చేయడంతో ఆ రోజున చంద్ర బాబు దంపతులు ఇంట్లోకి ప్రవేశించనున్నారు.

వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఈ ఇంట్లో స‌క‌ల సౌక‌ర్యాలు ఉన్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ నివాసంలో సమావేశ మందిరం - కార్యాలయంతో పాటు జిమ్‌ - స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 35వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన నివాసం స్టిల్ట్‌ లో 15 నుంచి 20 వాహనాలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సెల్లార్‌ లో సమావేశ మందిరాన్ని, తన కార్యాలయంలో పనిచేసే అధికారులు - సిబ్బంది కూర్చుని తమ పనులను నిర్వహించుకునేందుకు వీలుగా సౌకర్యాలను కల్పించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో తన కార్యాలయంతో పాటు అంతరంగిక కార్యదర్శులు - ఇతరులు కూర్చుని తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇదే అంతస్తులో దేశ - విదేశీ ప్రతినిధులు - కేంద్ర మంత్రులు - ఇతర ముఖ్యులు వచ్చిన సమయంలో వారితో చర్చలు జరిపేందుకు వీలుగా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. తనను కలిసేందుకు వచ్చే ముఖ్యులకు అల్పాహార విందు లేదా మధ్యాహ్నం - రాత్రి వేళల్లో భోజన ఏర్పాట్లు చేసేందుకు డైనింగ్‌ హాల్‌ ను, దానికి అనుకుని వంటగదిని నిర్మించారు. మొదటి అంతస్తులో చంద్రబాబు పడక గదితో పాటు ఈ అంతస్తులోనే గ్రంధాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.రెండవ అంతస్తులో చంద్రబాబు తనయుడు లోకేష్‌ పడక గదితోపాటు ఆయన తనయుడు దేవాన్ష్‌ ఆడుకునేందుకు, ప్రత్యేకంగా తాను నిద్రించేందుకు పడక గదిని ఏర్పాటుచేశారు. మొత్తం ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ నూతన గృహంలో ఒక అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్ళేందుకు వీలుగా మెట్లతో పాటు లిఫ్ట్‌ సౌకర్యాన్ని కల్పించారు.

తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా, అంతకు ముందు తెదేపా ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్‌ అధ్యక్షునిగా చంద్రబాబు పాత నివాసంలో ఉన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం పాత నివాసాన్ని కూలదోసి పక్కన ఉన్న మరో వెయ్యి గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ స్థలంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నా వారం, పది రోజుల్లో సమయాన్ని బట్టి హైదరాబాద్‌ రావడం కుటుంబ సభ్యులతో గడుపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు తనయుడు లోకేష్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన కూడా ఇకనుంచి తన పూర్తి సమయాన్ని వెలగపూడిలోనే వెచ్చించనున్నారు.

చంద్రబాబు పాత నివాసాన్ని ఖాళీ చేశాక జూబ్లిహిల్స్‌ లోని రోడ్‌ నెంబర్‌ 10లో అద్దె ఇంటిని తన నివాసంగా ఎంచుకున్నారు. ఈ నివాసం వాస్తు ప్రకారం నిర్మించలేదని పండితులు చెప్పడంతో అక్కడి నుంచి ఆ ఇంటిని ఖాళీచేసి కొండాపూర్‌ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తన మకాన్ని మార్చారు. ఈ నివాసంలో నాలుగైదు నెలలు గడిపిన చంద్రబాబు విజయవాడలో తాత్కాలిక నివాసాన్ని ఏర్పాటుచేసి అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వ కార్యకలాపాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి - కోడలు బ్రాహ్మణి మాత్రమే హైదరాబాద్‌ లో ఉంటుండడంతో వారు బంజారా హిల్స్‌ లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌ లో ఉంటున్నారు. అడపాదడపా చంద్రబాబు - ఆయన తనయుడు లోకేష్‌ వస్తున్నా ఒకటి - రెండు రోజులు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి విజయవాడకు పయనమవుతున్నారు. బంజారా హిల్స్‌లో నూతన గృహం పూర్తి కావడంతో ఈనెల 9న గృహ ప్రవేశం నిర్వహించి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/