Begin typing your search above and press return to search.

న‌దుల అనుసంధానంలో మ‌రో అడుగు

By:  Tupaki Desk   |   18 April 2016 2:17 PM GMT
న‌దుల అనుసంధానంలో మ‌రో అడుగు
X
ప‌ట్టిసీమ‌తో న‌దుల అనుసంధానంలోనే దేశ‌వ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇపుడు మ‌రో ఆప‌రేషన్‌ కు శ్రీ‌కారం చుట్టారు. రాయలసీమ - ప్రకాశం - నెల్లూరు జిల్లాల ప్రజలకు సాగునీరు - తాగునీరు - పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నీటిని అందించేందుకు కొత్త ప్రాజెక్టును చంద్ర‌బాబు చేపడుతున్నారు. గోదావరి - పెన్నా నదుల అనుసంధానం సర్వే పనులను కేంద్ర జలవనరుల శాఖ ప‌రిధిలోని 'వ్యాప్‌ కోస్‌' సంస్థకు అప్పగించారు.

గోదావరి నదిలో వచ్చే వరద నీటిని పెన్నా నది వరకు మళ్ళించి వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఈ అనుసంధానాన్ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. నాలుగు నెలల్లో ఈ సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక (సమగ్ర ప్రాజెక్టు సమాచారం- డిపిఆర్‌) అందచేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గోదావరి వరద జలాలను కృష్ణా నదికి తరలించి ప్రకాశం బ్యారేజీ వద్ద నుండి పెన్నా నదితోపాటు పాలార్‌ కు మళ్ళించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. 400 టిఎంసిలను మొత్తంగా మళ్ళించాలని, దానికి ఎంత విద్యుత్‌ అవసరం పడుతుంది, ఎత్తిపోతలకు వినియోగించే మోటారు పంపులు ఈప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం - ప్రాజెక్టు వలన ప్రజలకు అందే ప్రయోజనాలు వీటి మధ్య సమతుల్యత ఏమేరకు ఉంటుందో పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి డిపిఆర్‌ ను సమర్పించాల్సి ఉంటుంది. డిపిఆర్‌ ను రూపొందించడంలో కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) నిబంధనలను పాటించాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టులో గ్రావిటీ కెనాల్స్‌ - ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించేందుకు ఎన్ని కాలువలు ఉంటాయో కూడా వివరించాలి. ఈ నదుల అనుసంధానంలో ఎన్ని కొత్త రిజర్వాయర్లు అవసరం అవుతాయో నివేదికలో చూపాల్సి ఉంది. మొత్తంగా న‌దుల అనుసంధానంలో బాబు ఫేజ్‌2 స్టార్ట్ చేసిన‌ట్లున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి.