Begin typing your search above and press return to search.

ప‌రువుపోతున్నా ప‌ట్టించుకోవా బాబు?

By:  Tupaki Desk   |   9 Sep 2015 5:19 PM GMT
ప‌రువుపోతున్నా ప‌ట్టించుకోవా బాబు?
X
తెలుగుదేశం పార్టీ అధినేత, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు పదేళ్లు సీఎంగా వ్య‌వ‌హ‌రించి....న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ సార‌థిగా ఉన్న‌ నారా చంద్ర‌బాబునాయుడుపై భారీ అపప్ర‌ద ఒక‌టి ఉంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల అభివృద్ధిని ఆయ‌న ప‌ట్టించుకోర‌ని, ప్రైవేటుపై ఉన్న మ‌మ‌కారం స‌ర్కారీ సంస్థ‌ల‌పై చూపించ‌ర‌ని అంటుంటారు. బాబు సీఎంగా ఉన్నపుడు హైద‌రాబాద్‌ లోని హెచ్ ఎంటీ, ఆల్విన్‌, త‌దిత‌ర కంపెనీలు మూత‌ప‌డ‌టం ఇందుకు త‌గిన ఉదాహ‌ర‌ణ‌గా వివ‌రిస్తుంటారు. నిజానిజాలు ప‌క్క‌న‌పెడితే...అదే ప‌రిస్థితి న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లోనూ ఎదుర‌వుతోందా? చంద్ర‌బాబునాయుడుకు తెలిసి లేదా తెలియ‌కుండా అయిన న‌వ్యాంధ్ర మ‌ణిదీపం చేజారిపోతుందా? అనే సందేహాలు వెలువ‌డుతున్నాయి.

కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(భెల్‌) కంపెనీ కొలువు దీరి ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం నుండి మచిలీపట్నంలో నడుస్తున్న ఈ కంపెనీ, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన భెల్‌ కంపెనీలో యుద్ధ రంగానికి సంబంధించిన పరికరాలు, ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీతో రాత్రి వేళల్లో సైనికులు శత్రువులను కనిపెట్టేందుకు ఉపయోగపడే కంటి అద్దాలు ఇక్కడే తయారవుతాయి. కార్గిల్‌ యుద్ధంలో ఈ భెల్‌ కంపెనీలో తయారైన అద్దాలను సైనికులు ఉపయోగించారు.

కేంద్రం ప్ర‌భుత్వ ఆధీనంలోని మచిలీపట్నంలో బెల్‌ కంపెనీ విస్తరణకు మచిలీపట్నంలో ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. పామర్రు మండలం నిమ్మకూరు సమీపంలో భూమి కావాలని కంపెనీ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. స్థానికంగా అర్చకులు కూడా దేవాదాయ భూములకు సంబంధించి కోర్టులో వేసిన కేసును కూడా ఇటీవల ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేదు. దీంతో మచిలీపట్నంలో విస్తరణకు భూములు కేటాయించకపోతే ఇతర రాష్ట్రాలకు కంపెనీని తరలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది.

మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ భూమి 14,800 ఎకరాలున్నా పెద్ద ఎత్తున ప్రయివేట్‌ భూములు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 'భెల్‌'ను స్థానికంగానే ఉంచేందుకు ఎటువంటి ప్రయత్నాలూ జరగడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. ఉన్న పరిశ్రమలను కాపాడుకోకుండా నూతన పరిశ్రమలు రావాలంటే భూములు అవసరమని చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోందని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోర్టు కోసం భూములు నష్టపోయే రైతులకు పెడన-మచిలీపట్నం బైపాస్‌ పక్కన ప్రపంచ స్థాయిలో అత్యాధునిక టౌన్‌ షిప్‌ ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ భెల్‌ విస్తరణకు స్థలాన్ని మాత్రం కేటాయించలేకపోతోంద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. ఈ నేపథ్యంలో భెల్‌ కంపెనీని కాపాడుకోవడంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.