Begin typing your search above and press return to search.

చిన‌బాబు మాట‌కు చంద్ర‌బాబు వాల్యూ ఇదేనా?

By:  Tupaki Desk   |   20 March 2019 5:33 AM GMT
చిన‌బాబు మాట‌కు చంద్ర‌బాబు వాల్యూ ఇదేనా?
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ఎంపీ.. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితా ఆ పార్టీలో రేపుతున్న గంద‌ర‌గోళం అంతా ఇంతా కాదు. ముందు చెప్పిన మాట‌ల‌కు భిన్నంగా ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేస్తూ టికెట్ల ఎంపిక జ‌రిగింద‌ని చెబుతున్నారు. బాబు త‌న‌కు సీటు ప‌క్కా అని చెప్పార‌ని.. కానీ చివ‌ర్లో హ్యాండిచ్చిన‌ట్లుగా ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు ల‌బోదిబోమంటుంటే.. అరే.. ఊరుకో.. కొడుకు మాట‌కే విలువ లేకుండా చేసిన చంద్ర‌బాబు.. నీకిచ్చిన మాట మీద నిల‌బ‌డ‌తారా ఏంది కామెడీగా? అంటూ ప్ర‌శ్నిస్తున్న వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సుడిగా చెప్పుకునే లోకేశ్ మాట‌ను సైతం బాబు లైట్ తీసుకున్న వైనం పార్టీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. 2018 జులైలో త‌న క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా క‌ర్నూలు ఎంపీగా బుట్టా రేణుక‌.. క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహ‌న్ రెడ్డి అంటూ ప్ర‌క‌టించేశారు. దీంతో.. వారిద్ద‌రి ఆనందం అంతా ఇంతా కాదు. చిన‌బాబు త‌న‌కు తానుగా ప్ర‌క‌టించిన రెండు స్థానాల విష‌యం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. చిన‌బాబు అభ‌య‌మిస్తూ.. క‌న్ఫ‌ర్మ్ చేసిన రెండు స్థానాల‌కు తాజాగా చంద్ర‌బాబు వేరే వారికి కేటాయించ‌టం తో పార్టీలో లోకేశ్ మాట‌కు ఉన్న విలువ ఏమిటో ఇప్పుడు అర్థ‌మైందంటున్నారు. టికెట్లను ఫైన‌ల్ చేసే విష‌యంలో క‌న్న‌కొడుకు ఇచ్చిన హామీని సైతం లైట్ తీసుకోవ‌టం త‌న‌కు మాత్ర‌మే కుదురుతుంద‌న్న విష‌యాన్ని బాబు చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. దీంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ లోకేశ్ మీద ప‌లువురు త‌మ్ముళ్లు పెట్టుకున్న ఆశ‌లు.. బాబు తాజా నిర్ణ‌యంతో ప‌టాపంచ‌లు అయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. చంద్ర‌బాబా.. మ‌జాకానా!