Begin typing your search above and press return to search.

గమనించారా?: మంగళగిరిలో ప్రచారం చేయని బాబు

By:  Tupaki Desk   |   11 April 2019 4:54 AM GMT
గమనించారా?: మంగళగిరిలో ప్రచారం చేయని బాబు
X
మీడియాలో పెద్దగా హైలెట్ కాని విషయంగా దీన్ని చెప్పాలి. పచ్చ మీడియా అంటూ బాబును ఎత్తి పొడిచే మీడియా సంస్థలు సైతం.. ఈ ఆసక్తికరమైన అంశాన్ని ఎక్కడా కవర్ చేయలేదు. ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మిగిలిన ఇద్దరు పార్టీ అధినేతలైన జగన్.. పవన్ లకు మించి ఎన్నికల సభల్లో ప్రసంగించారు.

జగన్.. పవన్ ల ప్రచారం డబుల్ డిజిట్లకే పరిమితం కాగా.. అందుకు భిన్నంగా 60ప్లస్ బాబు మాత్రం ట్రిపుల్ డిజిట్లలో ఎన్నికల సభల్ని నిర్వహించటం విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఏపీ మొత్తం సుడిగాలి పర్యటన చేసిన బాబు.. తన కొడుకు బరిలో ఉన్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ప్రచారాన్ని నిర్వహించకపోవటం గమనార్హం.

గడిచిన 30 ఏళ్లలో మంగళగిరి స్థానాన్ని చేజిక్కించుకోని విచిత్రమైన రికార్డు టీడీపీకి ఉంది. సాధారణంగా పార్టీ అధినేతలు కానీ.. వారి రాజకీయ వారసులు తాము బలంగా ఉండే ప్రాంతం నుంచి బరిలోకి దిగుతారు. అందుకు భిన్నంగా లోకేశ్ ను మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దింపింది టీడీపీకి ఏ మాత్రం అనుకూలమైన నియోజకవర్గం నుంచి కాకపోవటం విశేషం.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలిచిన అనుభవం లేని లోకేశ్ కు.. అన్నప్రాశన రోజే ఆవకాయ పచ్చడి అన్నట్లుగా తొలిసారే క్లిష్టమైన మంగళగరి బరి నుంచి దింపిన వైనం అందరి చూపు పడేలా చేసింది. అదే సమయంలో.. తన కొడుకు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో బాబు ప్రచారం చేయకుండా ఉండటం వెనుక కారణం లేకపోలేదు. మంగళగిరిలో లోకేశ్ విషయం.. అతనికే చెందాలని.. తాను వాటా తీసుకోకూడదన్న ఆలోచనతోనే బాబు ప్రచారానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

సొంత కష్టం మీదనే మంగళగిరి విజయాన్ని లోకేశ్ సొంతం చేసుకున్నారన్న క్రెడిట్ కోసమే ఈ సాహసానికి దిగినట్లుగా చెబుతున్నారు. మరి.. బాబు.. చినబాబు సాహసం ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందన్న విషయం తేలాలంటే మే 23 వరకూ వెయిట్ చేయక తప్పదు.