Begin typing your search above and press return to search.

బాబును మించిపోయిన భజన బృందం

By:  Tupaki Desk   |   9 March 2018 3:30 PM GMT
బాబును మించిపోయిన భజన బృందం
X
ముఖప్రీతి పొగడ్తలకు భూ ప్రపంచంలో ఎవ్వరూ అతీతులు కాదు . ఆ కిటుకు పట్టుకుంటే గనుక ప్రతి ఒక్కరినీ పక్కన పడేయడం చాలా సులభమైన సంగతి. అసలు తన గురించి తాను విపరీతంగా పొగుడుకునే చంద్రబాబు నాయుడుకు ఇతరులు కూడా పడాలని కోరిక ఉండటం సహజం. చంద్రబాబు తీరు తెలిసిన ఆయన సహచరులకు ఈ విషయం తెలియని సంగతేమీ కాదు. అందుకే బాబు అడిగీ అడగకముందే విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ గురించి వారు ఆయనకు సమాచారం అందిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో వ్యూహ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి దాన్ని సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు నాయుడు, ఆ భేటీలో భాజపాతో తెగతెంపులు చేసుకున్న వ్యవహారంపై ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాలని కోరారు. పార్టీ అధినేత మహాద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్టుగా భజన చేయడానికి అనుచరులకు ఓ సదవకాశం లభించింది. అంతరించి పోయి తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజలలో 98 శాతం మంది ఈ నిర్ణయం పట్ల హర్షధ్వానాలు చేస్తున్నట్టుగా పార్టీ నాయకులు అధినేతకు తెలియజెప్పారు.

రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను ఈ నాయకులు ఎన్నడూ సర్వే చేసారో తెలియదు గానీ ఇంత భారీ మెజారిటీతో చంద్రబాబు ని అభినందించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజాభిప్రాయం నాయకుల ద్వారా తెలుసుకుని చంద్రబాబు కూడా ఖచ్చితంగా మురిసిపోయే ఉంటారు. ప్రజల్లో తన కీర్తి ఇనుమడించిపోతున్నదని ఆనందించి ఉంటారు.

కానీ వాస్తవంలో ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు ఉన్నాయి. మంత్రి పదవులు వదులుకొని ఎన్డీయేలో మాత్రం ఎందుకు ఇంకా కలిసి ఉన్నారని ప్రజల్లో నూటికి నూరు శాతం మంది అనుమానిస్తున్నారు. మంత్రులుగా సాధించలేనిది మామూలు ఎంపీలుగా ఆ పార్టీ జట్టులో ఉండి ఏమి సాధించగలరు అని ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు రాకుండా.. ఇంకేదో బేరసారాలకోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారనే అనుమానం పలువురిలో ఉంది. మరి చంద్రబాబు నిజమైన ఈ ప్రజాభిప్రాయాన్ని ఎలా తెలుసుకుంటారో.. తన తప్పుని ఎలా దిద్దుకుంటారో వేచి చూడాలి.