Begin typing your search above and press return to search.

ఢిల్లీ అస్సలు నచ్చటం లేదా బాబు?

By:  Tupaki Desk   |   23 Sep 2016 6:04 AM GMT
ఢిల్లీ అస్సలు నచ్చటం లేదా బాబు?
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరులో ఈ మధ్యన కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. అన్నింటి తానే కనిపించాలన్న ధోరణి తగ్గుతోంది. తన పరిధిని.. పరిమితిని ఆయన గుర్తించినట్లుగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముగిశాక.. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసిన వెంటనే.. ఆయన నోటి వెంట వచ్చిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటే.. వారంలో రెండు రోజులు ఢిల్లీకి కేటాయిస్తానని చెప్పారు. అప్పుడే కాదు.. అలాంటి మాటలుకొద్దికాలం పాటు నడిచాయి. బాబు జోరుకు ప్రధాని మోడీ తనదైన శైలిలో బ్రేకులు వేయటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అయ్యారని చెబుతారు.

చేతిలో పవర్ ఉన్నా.. చక్రం తిప్పలేని వైనానికి బాబు అసహనం చెందినట్లుగా ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. అయితే.. ఢిల్లీలో కూర్చున్నది మామూలు వ్యక్తికాకపోవటంతో.. ఏపీ చేయలేక ఢిల్లీ పర్యటనల్లో కాసింత మార్పులు చేసుకున్నట్లు చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. రాష్ట్ర పనుల నిమిత్తం ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లటం.. మంత్రుల్ని కలిసే ప్రోగ్రాం ఉండేది.

ఆ విషయంలోనూ.. తన వైఖరిని మోడీ స్పష్టం చేయటం.. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం తరపున చేయాల్సిన పనులన్నీ తమ అధికారులే చక్కదిద్దేవారంటూ ఆయన ఇచ్చిన సలహా ఇచ్చినట్లుగా చెబుతారు. మోడీ మాటల్లోని మర్మాన్ని గుర్తించిన బాబు.. ఆయనతో సంబంధాలు చెడగొట్టుకోవటం ఇష్టం లేకనే ఢిల్లీకి వెళ్లే అలవాటును తగ్గించుకున్నారని చెబుతారు. మోడీ సర్కారు నుంచిఎంతో ఆశించినా.. మోడీ మాత్రం అందుకు సిద్ధంగా లేని విషయాన్ని చక్కగా అర్థం చేసుకున్న చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్లటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్నారని చెబుతారు.

ఇటీవల కాలంలో ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై కినుకుగా ఉన్న బాబు.. తన ఫోకస్ అంతా ఏపీ మీదనే పెట్టినట్లుగా చెప్పాలి. ఓపక్క ఢిల్లీ.. మరోవైపు తెలంగాణ.. ఇంకోవైపు ఆంధ్రా మీద మొదట్లో దృష్టి సారించిన చంద్రబాబు.. తర్వాతి కాలంలో ఎక్కడ తన ఫోకస్ పెంచాలన్న విషయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ లో బాబుకు సన్నిహితంగా ఉండే వారి ఫీడ్ బ్యాక్ ఆయనపై ప్రభావాన్ని చూపించిందని చెబుతారు.

ఢిల్లీకి ఎంత ఎక్కువ వెళితే అంత నష్టమన్న విషయాన్ని అర్థం చేసుకున్న బాబు.. ఢిల్లీ పర్యటనపై ఏమాత్రం మక్కువ చూపటం లేదని చెబుతున్నారు. దీనికి నిదర్శనంగా మొన్న జరిగిన అపెక్స్ కౌన్సిట్ భేటీ పెద్ద ఉదాహరణగా చెప్పాలి. భేటీ కోసం ఢిల్లీ వెళ్లి బాబు.. అది పూర్తి అయిన వెంటనే ఏపీకి చేరుకున్నారేకానీ ఢిల్లీలో అస్సలు స్టే చేయలేదు. బాబు కంటే కాస్త ముందు ఢిల్లీ వెళ్లిన తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..దేశరాజధానిలోనే ఉండిపోతే.. బాబు మాత్రం బెజవాడకు వచ్చేయటం గమనార్హం. బాబులో కొన్ని మార్పులు కొట్టొచ్చినట్లుగా కనిపించట్లేదు..?