Begin typing your search above and press return to search.

బీజేపీతో పాటు హస్తం పార్టీకీ బాబు దూరం జరిగినట్టే!

By:  Tupaki Desk   |   26 Aug 2019 2:30 PM GMT
బీజేపీతో పాటు హస్తం పార్టీకీ బాబు దూరం జరిగినట్టే!
X
తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యూహాల్లో భారీ మార్పే కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా... బీజేపీతో దోస్తీకి చరమ గీతం పాడేసిన చంద్రబాబు... కొత్తగా గ్రాండ్ ఓల్డ్ పార్టీతో కొత్త దోస్తీ కట్టారు. అయితే ఆ దోస్తీ విఫల ఫలితాలను ఇవ్వడంతో చంద్రబాబు... ఇప్పుడు హస్తం పార్టీకి కూడా దూరం జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. హస్తం పార్టీకి దూరంగా జరిగితే... తన చిరకాల మిత్రుడిగా భావించే బీజేపీకి చంద్రబాబు మరోమారు దగ్గరవుతారా? అన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.

బీజేపీకి మరోమారు దగ్గరయ్యే విషయాన్ని కాస్తంత పక్కనపెడితే... అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు దూరం జరుగుతున్నారని చెప్పడానికి గల ఉదాహరణలు ఏమిటన్న విషయానికి వస్తే... చాలా ఉదాహరణలే కనిపిస్తున్నాయి. 70 ఏళ్లుగా జమ్మూ కశ్మీర్ కు కొనసాగుతున్న స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫరూక్ అబ్దుల్లా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఫరూక్ అబ్దుల్లా విషయాన్ని పక్కనపెడితే... జాతీయ దృక్కోణం ఉన్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ వైఖరికి చంద్రబాబు మద్దతు పలకాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు... కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. బీజేపీ వైఖరికే జైకొట్టినట్టుగా వ్యవహరించారు.

ఈ విషయాన్ని కశ్మీర్ కోణం నుంచి చూసిన నేపథ్యంలోనే బాబు కాంగ్రెస్ కు హ్యాండిచ్చారని అనుకున్నా... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రిగానే కాకుండా తనకు అత్యంత ఆప్త మిత్రుడిగా పేరుపడ్డ పి.చిదంబరం అరెస్టైతే... ఆ విషయంపై చంద్రబాబు ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేయకపోవడం గమనార్హం. అసలు చిదంబరం ఎవరన్న తరహాలో ఆ విషయాన్నే పట్టించుకోనంతగా బాబు వ్యవహరించిన తీరు నిజంగానే ఆసక్తికరమనే చెప్పాలి. ఈ రెండు ఘటనల్లో చంద్రబాబు వైఖరిని కాస్తంత లోతుగా పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీకి ఆయన దూరం జరుగుతున్నట్లుగానే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అందులోనూ కాంగ్రెస్ పార్టీతో ఏనాడూ జతకట్టని చంద్రబాబు... గడచిన ఎన్నికలకు కాస్తంత ముందుగా కొత్త పొత్తు పెట్టుకున్నారు. ఈ పొత్తు లాభించకపోగా... టీడీపీకి తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగేందుకే చంద్రబాబు నిర్ణయించుకున్నట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి కటీఫ్ చెప్పేస్తే.. చంద్రబాబు మరలా బీజేపీకి దగ్గరవుతారా? అన్న కోణంలోనూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.