Begin typing your search above and press return to search.

కేసీఆర్ కంటే బాబు వెనుక‌బడ్డారే!

By:  Tupaki Desk   |   4 July 2017 5:45 AM GMT
కేసీఆర్ కంటే బాబు వెనుక‌బడ్డారే!
X
నిజ‌మే... కేసీఆర్ దూకుడు ముందు చంద్రబాబు నిల‌వ‌లేక‌పోతున్నార‌న్న వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. గ‌తంలో ఏ అంశం మీద అయినా కేసీఆర్ కంటే కూడా చంద్రబాబే స్పీడు అన్న వాద‌న ఉండేది. ప్ర‌తి విష‌యంపై కేసీఆర్ కంటే స్పీడుగా స్పందిస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు... సీఎంగా త‌న స్పీడును కేసీఆర్ అందుకోలేర‌న్న స్థాయిలోనూ చంద్రబాబు వ్య‌వ‌హ‌రించిన తీరును కూడా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు మ‌రిచిపోరు. ఎందుకంటే... గ‌తంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఉండ‌గా, ఆయ‌న కేబినెట్‌ లో అంత‌కుముందు కాంగ్రెస్‌ లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో పాటు కేబినెట్ ప‌ద‌విని ద‌క్కించుకున్న చంద్ర‌బాబు... పాల‌నా వ్య‌వ‌హారాల్లో ఆరితేరిన వారేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌ద‌నంత‌ర కాలంలో ఎన్టీఆర్ చేతిలోని పాల‌నా ప‌గ్గాల‌ను లాగేసుకున్న చంద్రబాబు... ఉమ్మ‌డి ఏపీకి ఏకంగా తొమ్మిదిన్న‌రేళ్ల పాటు ఏక‌బిగిన సీఎంగా పాల‌న సాగించారు. నాడు సీఎం చంద్ర‌బాబు జిల్లా ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌స్తున్నారంటే... ఆయా జిల్లాల అదికార యంత్రాంగం ఒణికిపోయిన వైనం కూడా ఇంకా మ‌న మదిలో నుంచి చెరిగిపోలేదు.

అయితే వైఎస్ దెబ్బ‌కు ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న చంద్ర‌బాబు... రాష్ట్ర విభ‌జ‌న‌ - పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుణ్య‌మా అని మ‌రోమారు సీఎం ప‌ద‌విని చేజిక్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికీ తాను య‌మా య ఆక్టివ్‌ గానే ఉన్నాన‌ని చెప్పేందుకు బాబు నానా ఆప‌సోపాలు ప‌డుతున్నారు. ఇందులో భాగంగానే ఆయ‌న రోజులో చాలా స‌మ‌యం స‌మీక్ష‌ల‌కే కేటాయిస్తున్నారు. ఇక ప‌ర్య‌ట‌న‌ల పేరిట ఆయ‌న చేస్తున్న విమాన‌యానాలు లెక్కే లేదు. అయితే ఎంత స్పీడుగా ఉన్న‌ప్ప‌టికీ... సీఎం కేసీఆర్ స్థాయిలో చంద్ర‌బాబు దూసుకెళ్ల‌లేక‌పోతున్నార‌న్న వాద‌న క్ర‌మంగా పెరిగిపోతోంది. ఈ వాద‌న‌ను నిజం చేస్తున్న‌ట్లుగా ఇప్పుడు ఓ అంశం తెర మీద‌కు వ‌చ్చింది. ఒకే దేశం- ఒకే ప‌న్ను పేరిట ఈ నెల 1న అర్ధ‌రాత్రి కేంద్రం వ‌స్తు - సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)కి తెర తీసింది. వెనువెంట‌నే ఆ ప‌న్ను విధానం అమ‌ల్లోకి వ‌చ్చేసింది. అయితే ఈ కొత్త ప‌న్ను విధానంపై అటు వ్యాపారుల‌కు గానీ, ఇటు అధికారుల‌కు గానీ పెద్ద‌గా అవ‌గాహ‌న లేద‌నే చెప్పాలి. దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించే విష‌యంలో ఆర్థిక శాస్త్రం చ‌దివిన చంద్ర‌బాబు లాంటి వారు ముందుగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని అంతా భావించారు.

అయితే చంద్రబాబు ఈ దిశ‌గా ఆలోచ‌న చేయ‌క‌ముందే... కేసీఆర్ ఏకంగా త‌న కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌నే ప్ర‌క‌టించేశారు. ఈ నెల 5 - 6 - 7 తేదీల్లో అటు అధికారుల‌తో పాటు వ్యాపార వ‌ర్గాల‌కు కూడా జీఎస్టీపై అవగాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతేకాదండోయ్‌... జీఎస్టీ కార‌ణంగా త‌మ రాష్ట్రానికి ఒన‌గూరే లాభ‌మెంత‌? వ‌చ్చే న‌ష్ట‌మెంత అన్న విష‌యంపైనా కేసీఆర్ ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో స్ట‌డీ కూడా చేసేశారు. అంతా భ‌య‌ప‌డ్డ‌ట్టుగా జీఎస్టీ కార‌ణంగా త‌మ రాష్ట్రానికేమీ న‌ష్టం లేద‌ని, ఇంకా కొద్దో గొప్పో లాభ‌మేన‌ని కూడా కేసీఆర్ లెక్క‌లు వేసి మ‌రీ చెబుతున్నారు. కేసీఆర్ ఈ స్థాయిలో బుల్లెట్‌ లా దూసుకెళుతుంటే... చంద్ర‌బాబు మాత్రం ఇంకా జీఎస్టీపై త‌న‌కు అవగాహ‌నే లేద‌న్న రీతిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా అస‌లే అప్పుల్లో ఉన్న న‌వ్యాంధ్ర‌కు జీఎస్టీ ఏ మేర‌కు న‌ష్టం చేస్తుంద‌న్న విష‌యంపైనే ఆయ‌న ప్ర‌ధానంగా దృష్టి సారించారు త‌ప్పించి... జీఎస్టీని త‌న‌కు అనుకూలంగా మల‌చుకునేందుకు బాబు అస‌లు కార్యాచ‌ర‌ణే రూపొందించ‌లేదు. అంతేనా... క‌నీసం జీఎస్టీపై అధికారులు, వ్యాపారుల‌కు అవగాహ‌న క‌ల్పించే విష‌యంలోనూ చంద్ర‌బాబు ఇంకా తొలి అడుగే వేయ‌లేదు. వెర‌సి ఇత‌ర విష‌యాల్లో ఎలా ఉన్నా... జీఎస్టీ విష‌యంలో మాత్రం కేసీఆర్ స్పీడును చంద్ర‌బాబు అందుకోవ‌డం దుస్సాధ్య‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/