Begin typing your search above and press return to search.

గుడి కట్టించుకోవటం బాబుకు ఇష్టమేనా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 4:13 PM GMT
గుడి కట్టించుకోవటం బాబుకు ఇష్టమేనా?
X
అభిమానం హద్దులు దాటితే.. చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవటం మామూలే. గతంలో సినిమా నటులకు సంబంధించి గుళ్లను కట్టించటం.. తర్వాత వాటిని ధ్వంసం చేయటం జరిగింది. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకు గుళ్లను కట్టించేలా నిర్ణయాలు తీసుకోవటం పెరిగింది. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఖరికి సంతోషపడిపోతున్న ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన తుళ్లూరు ప్రాంతానికి చెందిన ఒక టీడీపీ నేత బాబు పేరిట ఒక గుడిని కట్టిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ విషయం మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది. అయితే.. హద్దులు దాటే అభిమానుల అభిమానానికి అధినేతల బ్రేకులు వేస్తుంటారు. ఆ మధ్యన ప్రధాని మోడీకి ఒక అభిమాని గుడి కట్టే ప్రయత్నం చేయటం.. దీనికి సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చిన వెంటనే మోడీ స్పందించి..ఆ కార్యక్రమాన్ని ఆపేయించారు. అలాంటివి వద్దంటూ నచ్చ చెప్పాలంటూ పార్టీ నేతల్ని పురమాయించారు.

అయితే.. బాబు మాత్రం అందుకు భిన్నంగా.. అసలు పట్టనట్లుగా ఉన్నారు. అభిమానంతో గుడి కట్టటం లాంటివి ప్రోత్సహించటం సరికాదన్న భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో. గుడికి సంబంధించిన పనులపై తరచూ వార్తలు వస్తున్నా బాబు మాత్రం రియాక్ట్ కావటం లేదంటే.. తన గుడిని చూసుకోవాలని చంద్రబాబు ఫీలవుతున్నారా? అన్న సందేహం కలగటం ఖాయం. ఇక.. బాబు గుడి విషయానికి వస్తే.. ఇందుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారు.

తుళ్లూరు గ్రామానికి చెందిన బుడ్డి సతీష్ అనే రైతు బాబు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. రాజధాని శంకుస్థాపన రోజే.. బాబు గుడి శంకుస్థాపన చేయాలని భావించారు. అయితే.. స్థలాన్ని పరిశీలించిన వాస్తు సిద్ధాంతి.. ఇలా ఒకేరోజు రాజధాని శంకుస్థాపన.. గుడి శంకుస్థాపన జరగటం మంచిది కాదని.. మరో మంచి ముహుర్తంలో చేయాలని సలహా ఇవ్వటంతో ప్రస్తుతానికి గుడి శంకుస్థాపన వాయిదా పడింది.