Begin typing your search above and press return to search.

పవన్ హెచ్చరికను బాబు పట్టించుకోలేదా?

By:  Tupaki Desk   |   5 Jan 2017 7:33 AM GMT
పవన్ హెచ్చరికను బాబు పట్టించుకోలేదా?
X
ప్రజాసమస్యల్ని తెర మీదకు తీసుకురావటం.. పది మంది దృష్టి పడేలా చేయటం.. వాటి మీద చర్చ జరగటం.. లాంటివి చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ మధ్యన గోదావరి మెగా అక్వా పార్క్ కారణంగా గోదావరి జలాలు కలుషితమవుతున్నాయన్న విషయాన్ని టేకప్ చేసిన పవన్.. ఆ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి స్పందించాలని.. బాధితులకు న్యాయం చేయాలని అల్టిమేటం ఇచ్చారు. దీనికి ప్రతిగా.. ఆదివారం అయినప్పటికీ పొద్దు పొద్దున్నే అధికారుల్ని.. మంత్రుల్ని పిలిపించుకొని రివ్యూ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు.. అక్వా పరిశ్రమ కారణంగా కాలుష్యం తలెత్తని రీతిలో చర్యలు తీసుకోవాలంటూ అధికారుల్ని ఆదేశించారు.

మెగా అక్వాపార్క్ తర్వాత.. పవన్ లేవనెత్తిన ఇష్యూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల అంశం. గడిచిన కొన్నేళ్లలో వేలాది మంది అంతుచిక్కని రీతిలో కిడ్నీ సమస్యతో మరణించటాన్ని తీవ్రంగా పరిగణించటమే కాదు.. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టే ఏపీ సర్కారు.. వేలాది మంది ప్రాణాల్ని కాపాడటం కోసం నిధులు లేవని చెప్పటం ఎంతవరకు సబబు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

పవన్ ప్రశ్నించటమే కాదు.. ఏపీ సర్కారుకు అల్టిమేటం కూడా ఇచ్చేశారు. 48 గంటల్లో ఉద్దానం ఇష్యూపై ఏపీ సర్కారు స్పందించాలని.. బాధిత కుటుంబాల్ని ఆదుకునే చర్యల్ని చేపట్టటంతో పాటు.. ఈ ఇష్యూ పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి రియాక్ట్ కావాలని కోరారు. ఈ రోజు ఉదయం 10 గంటలతో పవన్ ఇచ్చిన టైమ్ అయిపోయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో మాదిరి పవన్ మాటలపై ఈసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్ట్ కాలేదు. గతంలో రాజధాని భూముల గురించి కానీ.. ఈ మధ్యన లేవనెత్తిన మెగా అక్వా పార్క్ ఉదంతంలో కానీ స్పందించిన రీతిలో రియాక్ట్ కానట్లుగా ఉండటం గమనార్హం.

ముఖ్యమంత్రి మాత్రమే కాదు.. మంత్రులు ఎవరూ కూడా ఈ అంశంపైపెద్దగా మాట్లాడింది లేదు. ఏపీ రాష్ట్ర కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం పవన్ పర్యటన మంచిదేనన్న మాటను చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా మాత్రం మంత్రులు అచ్చెన్నాయుడు.. ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ లు భేటీ అయి.. పవన్ చేసిన డిమాండ్లపై చర్చలు జరుపుతున్నారు. గతంలో లేని విధంగా ముఖ్యమంత్రి కాకుండా మంత్రులు పవన్ డిమాండ్ల మీద చర్చలు జరపటం చూసినప్పుడు.. పవన్ ను చంద్రబాబు లైట్ తీసుకున్నారా? అన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/