Begin typing your search above and press return to search.

బాబును క‌ల‌వ‌టంలో రేవంత్ మార్క్ రాజ‌కీయం

By:  Tupaki Desk   |   2 Nov 2017 1:30 AM GMT
బాబును క‌ల‌వ‌టంలో రేవంత్ మార్క్ రాజ‌కీయం
X
రాజ‌కీయాలు మ‌హా చిత్రంగా ఉంటాయి. పైకి మామూలుగా కనిపిస్తాయి. కానీ.. లోతుల్ని చూస్తే ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాలు అందులో ఇమిడి ఉంటాయి. తాజాగా అలాంటిదే రేవంత్ రాజీనామా వ్య‌వ‌హారంలో ఉంద‌ని చెప్పాలి. టీటీడీపీ ఫైర్ బ్రాండ్ గా సుప‌రిచిత‌మైన రేవంత్ రెడ్డి పార్టీ ప‌ద‌వికి.. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన వైనం పాత ముచ్చ‌టే. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన రేవంత్ ఆ లేఖ‌ను నేరుగా స్పీక‌ర్‌కు పంప‌కుండా.. పార్టీ అధినేత‌కు పంప‌టంలో మ‌ర్మమేంది? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ఒక‌వేళ పార్టీలో ఉండి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి.. ఆ లేఖ‌ను అధినేత‌కు పంపారంటే అందులో ఎంతోకొంత అర్థం ఉంద‌ని చెప్పాలి. కానీ.. అందుకు భిన్నంగా పార్టీకి రాజీనామా చేసేసిన త‌ర్వాత‌.. త‌న‌కేమాత్రం సంబంధం లేని పార్టీ అధినేత‌కు త‌న ఎమ్మెల్యే రాజీనామా లేఖ‌ను బాబుకు పంప‌టంలోనే అస‌లు రాజ‌కీయ‌మంతా దాగి ఉంద‌ని చెబుతున్నారు.

ఇక్క‌డే మ‌రో విష‌యాన్ని ప్ర‌స్తావించాలి. ఒక‌వేళ రేవంత్ రాజీనామా లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపిన‌ప్పుడు.. పార్టీకి గుడ్ బై చెప్పేసి.. ఢిల్లీకి వెళ్లి మ‌రీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడి చేతుల మీదుగా పార్టీ మారిన త‌ర్వాత కూడా ఆయ‌న రాజీనామా లేఖ‌ను త‌న ద‌గ్గ‌రే ఉంచుకోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

చంద్ర‌బాబు ఫారిన్ టూర్ లో ఉన్న‌ప్పుడు రేవంత్ పార్టీ మారే విష‌యం బ‌య‌ట‌కు రావ‌టం.. ఆ విష‌యం మీద రేవంత్ కిమ్మ‌న‌కుండా ఉండ‌ట‌మే కాదు.. బాబు వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేసి.. ఆయ‌న్ను రెండుసార్లు క‌లిసిన త‌ర్వాతే పార్టీకి గుడ్ బై చెప్ప‌టం క‌నిపిస్తుంది. నిజానికి పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వ్య‌క్తిని క‌లిసేందుకు అధినేత‌లు ఇంట్ర‌స్ట్ చూపించ‌రు. కానీ.. రేవంత్ విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా జ‌రిగింది.

బాబును క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క విమ‌ర్శ చేయ‌కుండా ఉన్న రేవంత్‌.. చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌ర్వాత కూడా త‌న‌లో ప‌చ్చ ర‌క్తం ఉందంటూ త‌న విధేయ‌త‌ను చాటుకున్నారు. అయితే.. దీనంత‌టికి కార‌ణాలు చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు. పేరుకు రాజీనామా చేసిన‌ప్ప‌టికీ త‌న లేఖ‌ను చంద్ర‌బాబుకు పంప‌టం ద్వారా రేవంత్ త‌న తెలివిని ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పాలి. ఒక‌వేళ ఆయ‌న కానీ త‌న రాజీనామా లేఖ‌ను నేరుగా స్పీక‌ర్‌కు పంపితే.. ఈపాటికి ఆమోదం పొందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పాలి.

ఇలాంటిదే జ‌రిగితే.. ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో మ‌ళ్లీ ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధం కావ‌టం.. ఆ ఉప ఎన్నిక‌ల్లో ఏదైనా లెక్క తేడా వ‌స్తే రేవంత్ కు భారీ న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. అందుకే కాబోలు సేఫ్ గా ఉండేందుకు బాబు చేతికి త‌న రాజీనామా లేఖ‌ను రేవంత్ అందించి ఉంటార‌ని చెబుతున్నారు. బాబు చేతికి రాజీనామా లేఖ ఇవ్వ‌టం ద్వారా.. వెనువెంట‌నే త‌న రాజీనామా లేఖ ఆమోదం పొంద‌కుండా ఉండేలా రేవంత్ జాగ్ర‌త్త ప‌డిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎందుకంటే.. ఒక ఎమ్మెల్యే త‌న రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్‌కు నేరుగా పంప‌కుండా వేరే వారికి పంపితే.. ఆ లేఖ స్పీక‌ర్‌కు చేరిన‌ప్ప‌టికీ వెంట‌నే నిర్ణ‌యం తీసుకునే వీల్లేదు. స‌ద‌రు ఎమ్మెల్యేను పిలిపించి.. త‌న‌కు అందిన రాజీనామా లేఖ నిజ‌మైన‌దేనా? కాదా? అన్న విష‌యాన్ని ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. ఏదైనా అభ్యంత‌రం ఉంటే చెప్పాల‌ని కోర‌తారు. ఆవేశంతో రాజీనామా చేసి ఉంటే వెన‌క్కి తీసుకోవ‌చ్చ‌ని చెబుతారు. కాస్త ఆలోచించి నిర్ణ‌యాన్ని చెప్పాల‌ని కూడా కోర‌తారు. ఇదంతా జ‌ర‌గ‌టానికి ఎంత‌లేద‌న్నా రెండు.. మూడు నెల‌ల‌కు పైనే ప‌ట్టొచ్చు. అది కూడా రేవంత్ రాజీనామా లేఖ స్పీక‌ర్ వ‌ద్ద‌కు చేరిన త‌ర్వాతే.

దీనికి ముందు చంద్ర‌బాబు.. త‌నకు రేవంత్ ఇచ్చిన రాజీనామా లేఖను స్పీక‌ర్‌కు పంపాల్సి ఉంటుంది. ఇదంతా చూస్తున్న‌ప్పుడు రేవంత్ రాజీనామా లేఖ‌ను బాబుకు ఇవ్వ‌టం వెనుక‌.. వీలైనంత వ‌ర‌కూ ఆల‌స్యంగా స్పీక‌ర్‌కు పంపాల‌న్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. అంటే.. పేరుకు రాజీనామా చేసిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ రేవంత్ ఎమ్మెల్యే పోస్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అన్నింటికి మించి ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉండ‌దు. నిబంధ‌న‌ల ప్ర‌కారం అసెంబ్లీ కాల‌ప‌రిమితి తీర‌టానికి ఏడాది కంటే త‌క్కువ స‌మ‌యం ఉంటే ఉప ఎన్నిక‌ను నిర్వ‌హించరు. ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యంల ఉంది. ఒక‌వేళ‌.. రేవంత్ రాజీనామా లేఖ బాబు నుంచి స్పీక‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి.. అక్క‌డ నిర్ణ‌యం తీసుకొని ఆమోద ముద్ర వేయ‌టం ఏడెనిమిది నెల‌లు ఆగితే.. ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశ‌మే ఉండ‌దు. రేవంత్ ప‌చ్చ రక్తం మాట వెనుక చాలానే లెక్క‌లున్న‌ట్లు లేదు?