Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ లా ఎందుకు చేయ‌లేవు బాబు?

By:  Tupaki Desk   |   20 Sep 2015 8:56 AM GMT
కేసీఆర్‌ లా ఎందుకు చేయ‌లేవు బాబు?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో రెండు రోజులు పాటు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కీల‌క‌మైన అంశాల‌ను విస్మ‌రించింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రెండంకెల వృద్ధి లక్ష్యం, కొత్త‌కొత్త నిర్ణ‌యాల‌తో ప‌రిపాల‌న‌లో వేగం తీసుకురావ‌డం వంటి అంశాలు బాగానే ఉన్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో తీవ్రంగా తాండ‌విస్తున్న‌ కరువును ఈ స‌మావేశం విస్మరించిందని తెలుస్తోంది.

రాష్ట్ర స్థూలోత్పత్తి పెంచేందుకు ప్రతిబంధకంగా తయారైన దుర్భిక్షం నివారణపై ఈ స‌మావేశం దృష్టి సారించలేదు. ఖరీఫ్‌లో అదనుకు చినుకు లేక సేద్యం నిలిచిపోగా, తొలకరి వానలకు సాగు చేసిన పంటలు చాలా వరకు ఎండిపోయాయి. రైతులు మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెల‌కొంది. నీరు లేక కృష్ణా డెల్టాలో చాలా చోట్ల నాట్లు పడలేదు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం కంటింజెన్సీ ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంది. అయితే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ లో ఆ విషయాలను పక్కనబెట్టినట్లు తెలిసింది. కరువు మండలాల ప్రకటనపై మాటమాత్రమైనా చర్చకు రాలేదని సమాచారం.

ఖరీఫ్‌ కాలమైన జూన్‌ నుంచి సెప్టెంబర్ మరో పది రోజుల్లో సీజను ముగుస్తోంది. అయినా ఇంకా కరువు మండలాల ప్రకటనపై సర్కారు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో 670 మండలాలుండగా సెప్టెంబర్‌ 19కి 181 మండలాల్లో వర్షాభావం నెలకొంది. సాగు విషయానికొస్తే ఇప్పటికి కావాల్సిన సాగులో 13 లక్షల ఎకరాలు బీడు పడ్డాయి. నూనెగింజలు తొమ్మిదిన్నర లక్షల ఎకరాల్లో సాగు కాలేదు. ఆహార ధాన్యాల సాగులో ఐదున్నర లక్షల ఎకరాల లోటు కొనసాగుతోంది. మొత్తంగా 309 మండలాల్లోనే సాగు ఆశాజనకంగా ఉంది. ప్రభుత్వమే 101 మండలాల్లో కంటిజెన్సీ ప్రణాళికలు అమలు చేయాలని నివేదికలు రూపొందించినా కలెక్టర్ల సమావేశంలో మాత్రం నామమత్రం కూడా చర్చించలేదు.

ఇంత తీవ్రంగా రాష్ర్టంలో ప‌రిస్థితులు ఉన్న‌ప్ప‌టికీ క‌రువుపై చ‌ర్చించ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రమే కాదు ఒకింత విస్మ‌య‌క‌రంగా ఉంది. క‌రువు మండ‌లాల‌ను ప్ర‌క‌టించి త‌మ‌కు నివేదిక అంద‌జేస్తే స‌హాయం చేసేందుకు సిద్ధ‌మ‌ని కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో క‌రువుపై చ‌ర్చ జ‌రిగింది. త్వ‌ర‌లోనే క‌రువు మండ‌లాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. అయితే ఏపీ స‌ర్కారు మాత్రం ఆ విధంగా అడుగులు వేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌రువు అంచ‌నాలు రూపొందించే రెవెన్యూ విభాగం జిల్లా కలెక్ట‌ర్ల చేతిలో ఉంటుంది. వారితో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఇంత కీల‌కమైన అంశం ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే.