Begin typing your search above and press return to search.

బాబు వ‌రం ఏపీ ప్ర‌జ‌ల‌కు శాప‌మా?

By:  Tupaki Desk   |   20 May 2017 5:13 AM GMT
బాబు వ‌రం ఏపీ ప్ర‌జ‌ల‌కు శాప‌మా?
X
వ‌రం అన్న‌ది అంద‌రికి సంతోషంగా ఉండాలి. కానీ.. ఏపీ ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం కొంద‌రికి మోదంగా మ‌రికొంద‌రికి ఖేదంగా మారింద‌న్న వాద‌న వినిపిస్తోంది. కొంద‌రికి సంతోషాన్ని క‌లిగించే ప్ర‌భుత్వ నిర్ణ‌యం కోట్లాది ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇబ్బందికి గురి చేస్తుంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. హైద‌రాబాద్ నుంచి ఏపీకి స‌చివాల‌యం త‌ర‌లి వ‌చ్చిన కొత్త‌ల్లో ఇచ్చిన వెసులుబాటు మ‌రో ఏడాది పాటు పొడిగించిన వైనం బాబు వైపు వేలెత్తి చూపేలా ఉంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.

విభ‌జ‌న నేప‌థ్యంలో హైద‌రాబాద్ లోని ఏపీ స‌చివాల‌యాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ‌మేఘాల మీద నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల్లో బాబు నిర్ణ‌యం మీద కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అయితే.. ఈ విష‌యంలో బాబు ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టంతో స‌చివాల‌యాన్ని అమ‌రావ‌తికి త‌ర‌లించే విష‌యంలో అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌లేదు.

దీంతో కుటుంబ ప‌రంగా స‌మ‌స్య‌లు ఎన్ని ఉన్నా.. ఉద్యోగం కోసం వాటిని వ‌దిలేసి అమ‌రావ‌తికి ప్ర‌యాణం కావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఉద్యోగుల్లో వెల్లువెత్తిన అసంతృప్తి నేప‌థ్యంలో.. వారికి వెసులుబాటు ఉండేలా వారానికి ఐదు రోజుల ప‌ని వేళ‌లు ఉండేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఎందుకంటే.. అమ‌రావ‌తికి త‌ర‌లిన ఉద్యోగుల్లో కుటుంబ స‌మేతంగా హైద‌రాబాద్‌ ను వీడిన వారు చాలా చాలా త‌క్కువ‌. ఎవ‌రిదాకానో ఎందుకు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుటుంబం సైతం హైద‌ర‌రాబాద్‌ లోనే ఉండిపోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

పిల్ల‌ల చ‌దువుల‌నో.. జీవిత భాగ‌స్వామి ఉద్యోగ‌మ‌నో.. కుటుంబ స‌భ్యుల అవ‌స‌రాల‌నో.. కార‌ణం ఏమైనా హైద‌రాబాద్ నుంచి క‌ద‌ల్లేని వారి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని వారానికి ఐదు రోజులు మాత్ర‌మే స‌చివాల‌యం ప‌ని చేసేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌కు కొంత వెసులుబాటు క‌లిగినా..ఏపీ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఇబ్బందేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. రాష్ట్ర పాల‌న‌కు గుండెకాయ లాంటి ఏపీ స‌చివాల‌యం శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచే బోసిపోతుంద‌న్న విమ‌ర్శ ఉంది. అయితే.. విభ‌జ‌న లాంటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి కొంత‌కాలం త‌ప్ప‌వ‌న్న మాట వినిపించింది. తాజాగా.. ఈ నిర్ణ‌యం తీసుకొని ఏడాది పూర్తి కావొస్తున్న సంద‌ర్భంలో.. వారానికి ఐదు రోజులు ప‌నిని మ‌రో ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది బాబు స‌ర్కారు.

దీనిపై ఏపీ స‌చివాల‌య ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేయ‌గా.. ఏపీ ప్ర‌జ‌ల్లో ఎక్కువ మంది ఈ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర ర‌థానికి కీల‌క చోద‌క శ‌క్తిగా ఉండే స‌చివాల‌యం మ‌రింత ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయాల్సి న వేళ‌.. వ్య‌క్తిగ‌త అంశాల‌తో పాల‌న‌లో వేగాన్ని త‌గ్గించేలా తాజా పొడిగింపు నిర్ణ‌యం ఉంద‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. వారానికి ఐదు రోజులే ప‌ని కావ‌టంతో.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నుంచే హైద‌రాబాద్ కు ప్ర‌యాణం అయ్యే వారు ఎక్కువ‌గా ఉండ‌టం.. సోమ‌వారం మ‌ధ్యాహ్నానికి ఆఫీసుకు చేరుకునే ఉదంతాలు ఉన్నాయ‌ని.. వీటి వ‌ల్ల పాల‌న‌లో వేగం మంద‌గిస్తుంద‌న్న ఆరోప‌ణ ఉంది. స‌చివాల‌య ఉద్యోగుల్ని సంతృప్తి ప‌ర్చేందుకు బాబు నిర్ణ‌యం బాగున్న‌ట్లు అనిపించినా.. ఓవ‌రాల్ గా చూసిన‌ప్పుడు మాత్రం వారానికి ఐదు రోజుల ప‌ని విధానం ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఏ మాత్రం సూట్ కాద‌న్న మాట వినిపిస్తోంది. కోట్లాది మంది మీద ప్ర‌భావం చూపే అంశంపై కొద్దిమంది సంతోషం కోసం తీసుకోవ‌టం ఏమిట‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/