Begin typing your search above and press return to search.

చండీమాతకు బెజవాడ దుర్గమ్మ చీర

By:  Tupaki Desk   |   27 Dec 2015 6:13 AM GMT
చండీమాతకు బెజవాడ దుర్గమ్మ చీర
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎర్రవల్లికి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవల్లిలో నిర్వహిస్తున్న అయుత చండీయాగంలో పాల్గొనేందుకు ఆయన హెలికాప్టర్ లో బయలు దేరారు. దాదాపు గంట సేపు యాగంలో పాల్గొనబోతున్న ఆయన విజయవాడ కనకదుర్గమ్మవారి చీర, కుంకుమలను తనతో పాటు తీసుకువెళ్లారు.

కేసీఆర్‌ నిర్వహిస్తున్న చండీయాగం నేడు చివరి రోజు కావడంతో కేంద్రమంత్రులు అశోక్‌ గజపతిరాజు - సుజన చౌదరిలు యాగంలో పాల్గొనేందుకు ఎర్రవల్లికి వస్తున్నారు. వీరి రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను, బందోబస్తును నిర్వహిస్తున్నారు. కాగా యాగం చివరి రోజు ఆదివారం తెల్లవారు జామునుంచి యాగస్థలి వద్దకు భక్త జనం పోటెత్తారు. అంచనాలకు మించి భక్తులు యాగస్థలి వద్దకు చేరుకుంటుండటంతో మంత్రి హరీష్ రావు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పడు ఆదేశాలు జారీ చేస్తూ ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఈ రోజు యాగం వద్దకు వస్తండటంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.