Begin typing your search above and press return to search.

లీకేజీలో లాజిక్ మిస్ అవుతున్నారేంటి బాబు?

By:  Tupaki Desk   |   29 March 2017 4:29 AM GMT
లీకేజీలో లాజిక్ మిస్ అవుతున్నారేంటి బాబు?
X
రాజకీయాల్లో ప్రత్యర్థిపై విమర్శలు చేయటం కామన్. కానీ.. ఈ పని చేసే సమయంలో కాస్తంత తెలివిని ఉపయోగించాలన్న చిన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మిస్ అవుతుండటం ఆశ్చర్యకరంగా మారింది. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజ్ కావటంపై బాబు చేసిన ప్రకటన.. ప్రస్తావించిన అంశాల్ని చూసినప్పుడు.. చిన్న చిన్న విషయాల్లోనూ బాబు లాజిక్ కు దూరంగా వ్యవహరించటం చూస్తే.. తన వాళ్లను కాపాడుకోవాలన్న తొందరలో.. తానేం మాట్లాడుతున్నానన్న చిన్న విషయాన్ని ఆయన మర్చిపోవటం స్పష్టంగా కనిపిస్తుంది.

తనను.. తన వాళ్లను ఇరుకున పడేసేలా లీకేజీల వ్యవహారం బయటకు రావటంతో ఈ ఉదంతం నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించిన తీరు పలు సందేహాలకు తావిచ్చేలా ఉందని చెప్పక తప్పదు. ఈ వ్యవహారం అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత.. దీనిపై ఈ నెల 30న ప్రకటన చేస్తామని చెప్పిన అధికారపక్షం.. షెడ్యూల్ లో లేని బిల్లులను తెర మీదకు తీసుకురావటం.. ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు.సహజంగా ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి మాట్లాడతారు.

కానీ..ఈ అంశంపై అకస్మాత్తుగా జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దానిపై గంటసేపు మాట్లాడటం.. పనిలో పనిగా30న ప్రకటన చేస్తామన్న లీకేజీలపై ముందస్తు ప్రకటన చేసేసిన తీరు చూస్తే.. ఆరోపణలు చేసిన విపక్షం సభలో లేనప్పుడు లీకేజీలపై ప్రకటన చేయటం ద్వారా..ఆ ఇష్యూను క్లోజ్ చేసేశామన్న భావన కలిగేలా చేశారు. ఎందుకింత తొందర.. హడావుడి అన్న విషయాన్ని చూస్తే.. చంద్రబాబుకు జాన్ జిగిరీ అయిన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు.. ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావుకు ఈ ఇష్యూలో సంబంధం ఉందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీకేజీలపై ముఖ్యమంత్రి చంద్రాబాబు హడావుడిగా ప్రకటన చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. లీకేజీ మకిలిని తమకేమాత్రం అంటలేదన్న తొండివాదనను వినిపించిన చంద్రబాబు.. ఈ ఇష్యూలోకి విపక్ష నేతను లాగిన వైనం షాకింగ్ గా ఉండటంతో పాటు..మరీ ఇంత ఇదిగానా?అన్న భావన కలిగేలా ఉందని చెప్పక తప్పదు. లీకేజీల బాధ్యులంటూ సాక్షిని సీన్లోకి తీసుకురావటం చిత్రంగా అనిపించకమానదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల ప్రకారం.. లీక్ అయిన ప్రశ్నా పత్రాన్ని నెల్లూరుకు చెందిన సాక్షి టీవీ విలేకరి ఉదయం 10.25 గంటలకు డీఈవోకు వాట్సప్ లో పంపారని..విచారణలో అన్నివివరాలు వెల్లడి అవుతాయని చంద్రబాబు చెబుతున్నారు. ఆయన మాటల్ని విన్నప్పుడు సాక్షివిలేకరికి..లీక్ కు లింకుకట్టాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది.

ఒకవేళ లీక్ చేసింది సాక్షి విలేకరే అయితే.. ఆయన ఆ విషయాన్ని అధికారికి సమాచారం ఎందుకు ఇస్తారన్న చిన్న లాజిక్ మిస్ అయిన క్రమం చూస్తే.. ఏదో విధంగా.. బట్టకాల్చి మీద వేయాలన్నఆలోచన తప్పించి మరింకే ఉద్దేశం అధికారపక్షానికి లేదన్న భావన కలగటం ఖాయం. సాధారణంగా తమకున్న నెట్ వర్క్ పరిధిలో నుంచి ఒకవిలేకరికి పలు అంశాల మీద సమాచారం అందుతుంది.ఆ విషయాన్ని బాధ్యతగా జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని వదిలేసి.. సమాచారంఅందించటమే పాపం అన్నట్లుగా మీడియా ప్రతినిధిపై అభాండాలు వేయటం చూస్తే.. లాజిక్ మిస్ అవుతూ తాను చెప్పే మాటలకు జనాలు నవ్వుకుంటారన్న విషయాన్ని చంద్రబాబు పట్టించుకోకపోవటం స్పష్టంగా కనిపించకమానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/