Begin typing your search above and press return to search.

తెలుగుదేశంలో అమలాపురం గోల!

By:  Tupaki Desk   |   12 March 2019 9:15 AM GMT
తెలుగుదేశంలో అమలాపురం గోల!
X
రోజురోజుకీ తెలుగుదేశంలో కాంగ్రెస్ వాతావ‌ర‌ణం పెరుగుతోంది. స‌రిగ్గా ఆ పార్టీ కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌వుతున్న‌పుడు ఇలా జ‌ర‌గ‌డం యాదృచ్ఛిక‌మే గాని... అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం తెలుగుదేశంలో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీలో గ్రూపులు-వ‌ర్గాలు మామూలుగా లేవు. అనంత‌పురం జిల్లాలో అయితే... కేవ‌లం ఈ గ్రూపు రాజ‌కీయాల వ‌ల్ల క‌నీసం ఆరు నియోజ‌క‌వ‌ర్గాలు తెలుగుదేశం ప్ర‌భుత్వం కోల్పోతోంది. ఇదే ప‌రిస్థితి దాదాపు 6 జిల్లాలో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో బాబుకు అధికారం అప్ప‌గించిన తూర్పుగోదావ‌రి - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లోనూ పరిస్థితి ఏమంత బాలేదు.

ఆ పార్టీ ప‌రిస్థితి తెలుసుకోవ‌డానికి ఒక్క అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిశీలిస్తే చాలు. వాస్త‌వానికి బాల‌యోగి కి ఉన్న ప‌ర‌ప‌తి వ‌ల్ల ఆ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో అత‌నికి మంచి పేరు వ‌చ్చింది. అయితే, బాల‌యోగి అనంత‌రం అక్క‌డ తెలుగుదేశం పార్టీ ప‌ట్టుకోల్పోయింది. సుమారు 20 ఏళ్ల త‌ర్వాత ఆయ‌న కొడుకును నిల‌బెట్టి బాల‌యోగి చ‌రిష్మాను వాడుకుందామ‌ని పార్టీ ప్ర‌య‌త్నం చేయ‌డమే ఒక విఫ‌ల ఆలోచ‌న‌. 20 ఏళ్లు అంటే ఒక త‌రం. ఒక త‌రం మారాక అదే సానుభూతి కొన‌సాగ‌డం అసాధ్యం. ఇక ఇత‌ని విష‌యంలో తెలుగుదేశం చేసిన హ‌డావుడి వ‌ల్ల ఉన్న ఎంపీ పండుల ర‌వీంద్ర పార్టీని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఇక దాదాపు బాల‌యోగి కుమారుడు హ‌రీష్ మాథుర్‌ కు అమ‌లాపురం ఇచ్చేయాల‌ని తెలుగుదేశం అధిష్టానం ఫిక్స‌యిపోయింది. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ ప్ర‌భావంపై సర్వే చేయ‌గా ఎంపీగా అంత ప్ర‌భావ‌వంత‌మైన అభ్య‌ర్థి కాద‌ని తేలింది. దీంతో అధిష్టానం ఆలోచ‌న‌లో ప‌డింది. ఇంత‌లో స‌డెన్ గా కాంగ్రెస్ ఎంపీగా ప‌నిచేసిన హర్ష‌ కుమార్ తెర‌పైకి వ‌చ్చారు.

హ‌ర్ష‌కుమార్ తెలుగుదేశం త‌రఫున అమ‌లాపురం అభ్య‌ర్థిగా పోటీ చేస్తే క‌లిసొస్తుంద‌ని టీడీపీ భావిస్తోంది. అయితే, బాల‌యోగి కుటుంబం నుంచి వ్య‌తిరేక‌త రాకుండా హ‌రీష్‌ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే... అటు హ‌రీష్‌ - ఇటు హ‌ర్ష‌కుమార్ ఇద్ద‌రు ప‌ర‌ప‌తితో గెల‌వొచ్చ‌ని తెలుగుదేశం ఆశ ప‌డుతోంది. అయితే, ఈ ఇద్ద‌రు పార్టీలో రెండు గ్రూపులుగా ప‌నిచేస్తున్నారు. దీంతో ఒక‌రి స‌హ‌కారం ఒక‌రికి లేదు. ఈ త‌లనొప్పే టీడీపీని ఇర‌కాటంలో ప‌డేయ‌గా... వైసీపీలోకి వెళ్లిన పండుల ర‌వీంద్ర వెన‌క్కు వ‌స్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌వీంద్ర వైసీపీలోకి చేరిన‌పుడు టిక్కెట్ ఆశించాడు. అయితే, జ‌గ‌న్ ఆరు నెల‌లుగా అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తులో ఉండి ఇప్ప‌టికే దాదాపు ఫైన‌ల్ చేశారు. ఈ నేప‌థ్యంలో ర‌వీంద్ర కోరిక నెర‌వేర‌క‌పోవ‌డంతో టీడీపీకి వస్తాన‌ని అంటున్నాడ‌ట‌. ఈ ప‌రిణామాలన్నీ చూస్తుంటే... మంది ఎక్కువైతే మ‌జ్జిగ ప‌లుచ‌న అవుతుంద‌న్న సామెత చందాన త‌యారువుతోంది... తెలుగుదేశం అమ‌లాపురం ప‌రిస్థితి. అస‌లు పార్టీ గెలుపు పై న‌మ్మ‌కం లేక తెలుగుదేశం ఇన్ని ప్ర‌త్యామ్నాయాలు ఆలోచిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి కాంగ్రెస్‌ లాగా ఒక‌రికి వ్య‌తిరేకంగా ఒక‌రు ప‌నిచేసి అమ‌లాపురం సీటు లో డిజాస్ట‌ర్ ఫ‌లితాల దిశ‌గా తెలుగుదేశం ప‌య‌నించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.