Begin typing your search above and press return to search.

అదే దుర్భిక్షం.. బాబుపై అదే ఆగ్రహం

By:  Tupaki Desk   |   17 Nov 2018 4:38 AM GMT
అదే దుర్భిక్షం.. బాబుపై అదే ఆగ్రహం
X
రాష్ట్రంలో 2004 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయా ? నీళ్లందక ఎండుతున్న పంటలను చూసి గుండె మండిన రైతులు.. ఆ ఆగ్రహ జ్వాలలో టీడీపీని మసి చేయడానికి సిద్ధంగా ఉన్నారా ? నాలుగేళ్లుగా నీరు సక్రంగా అందక - పంటలు పండక అప్పులు పాలైన రైతాంగం ఆశలు ..ఆ ఏడాది కూడా అడియాసలేనా ? రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

రాష్ట్ర రాజధాని ప్రధాన కేంద్రమైన గుంటూరులో నాలుగేళ్లుగా అనేక మంది రైతులు అప్పుల ఉరికొయ్యకు వేలాడారు. వ్యవసాయం మినహా మరే పని చేతగాని అన్నదాతలు.. రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మి.. భార్య మెడలో పుస్తెలు అమ్మి.. పుడమి తల్లి నుదుటిన పచ్చని తిలకం దిద్దారు. తొలకరి జల్లులకు పులకరించి సాగు చేపట్టారు. ఎక్కువ భాగం ఆరుతడి పంటకే మొగ్గు చూపారు.

సీఎం హామీ.. అంతా బూటకం

నెల రోజులు గడిచాక.. నాగార్జున సాగర్‌కు వరద నీరు వచ్చి చేరడంతో.. మాగాణి పంటలకు నీరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఒక్క ఎకరా కూడా ఎండనీవ్వబోమని భరోసా ఇచ్చారు. సీఎం మాటలు నమ్మిన రైతాంగం అప్పటి వరకు సాగులో ఉన్న కంది - మినప వంటి ఆరు తడి పంటలు పీకేసి వరి సాగుకు శ్రీకారం చుట్టారు. పెట్టుబడి పెరిగినా సీఎం చెప్పిన మాటలు - మాగాణిపై ఉన్న ప్రేమతో ముందుకు సాగారు.

వారబందీ

మొక్క నాటాక నీటి విడుదల ఆగిపోయింది. పంట ఎండు ముఖం పట్టింది. రైతు గుండెల్లో ఆందోళన మొదలైంది. ఈ సమయంలో వారబందీ అంటూ సీఎం చంద్రబాబు రైతుల ఆందోళనను మరింత పెంచారు. నెలలో 18 రోజులు నీళ్లిచ్చి 12 రోజులు ఆపేస్తామని ప్రకటించారు. ఈ ప్రకారం ఏ ఒక్క ఎకరాకూ సక్రమంగా నీరందడం లేదు. మొక్కలు బతకడం లేదు. దీంతో అనేక చోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన గళం విప్పుతున్నారు.

మళ్లీ మోసపోయాం

1994లో గద్దెనెక్కిన చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. హైటెక్‌ పాలనంటూ నేల విడిచి విదేశాల బాట పట్టారు. ఆ కాలంలో అనేక మంది రైతులు అప్పుల పాడిపై ఆశువులు బాశారు. మరెందరో అన్నదాతలు వ్యవసాయాన్ని వదిలేసి వేరే వృత్తులకు మళ్లారు. ఇలా వ్యవసాయాన్ని దండగగా మార్చడంతోనే 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అన్నదాతలు ఘోరీ కట్టారు. బాబును సాగనంపారు. అనంతరం వచ్చిన దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు.

2004 ఫలితాలు రిపీట్‌ అవుతాయా ?

రైతులను నిర్లక్ష్యం చేసిన ప్రతి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ పండితులు.. ఇప్పటికీ గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని కదిలిస్తే కన్నీటి రూపంలో తమ దీనగాథను ఏకరువు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు కూడా లేని ఈ సమయంలో రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం.. చంద్రబాబుకు శాపంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.