Begin typing your search above and press return to search.

బాబు ప్ర‌క‌ట‌న‌: అందుకే అసెంబ్లీ లేట‌వుతోంది

By:  Tupaki Desk   |   29 Oct 2017 4:45 AM GMT
బాబు ప్ర‌క‌ట‌న‌: అందుకే అసెంబ్లీ లేట‌వుతోంది
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఏది అనుకున్నా సాధించే ఘ‌టం అని పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి సీఎం అయిన ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వేగంగా చేప‌డుతున్నారు. ప్ర‌ధానంగా సంక్షేమ పింఛ‌న్ల‌ను అర్హులైన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ఖ‌చ్చితంగా ప్ర‌తి నెలా 1 నే అందిస్తున్నారు. ఇదిలావుంటే, రాజ‌ధాని లేని రాష్ట్రానికి రాజ‌ధాని నిర్మించే అవ‌కాశం రావ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృతం అంటూ ప‌దే ప‌దే చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నో వివాదాలు త‌లెత్తినా.. కూడా రాజ‌ధాని నిర్మాణాన్ని విజ‌య‌వాడ - గుంటూరు స‌రిహ‌ద్దు ప్రాంతంలో చేప‌ట్టి.. అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం నిరంత‌రం కృషి చేస్తున్నారు. ఈ నిర్మాణాలు త‌ర‌త‌రాలు నిలిచిపోయేలా ఉండాల‌ని కూడా ఆయ‌న ఎన్నో ఆశ‌ల‌తో ఉన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న అనేక సార్లు వెల్ల‌డించారు కూడా.

ఇక‌, అమ‌రావ‌తిలో నిర్మించే న‌వ న‌గ‌రాల‌పై ఆయ‌న ఒక స్ప‌ష్ట‌త‌తో కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా అసెంబ్లీ - న్యాయ న‌గ‌రం వంటి కీల‌క అంశాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. దీంతో వీటి నిర్మాణాల‌కు సంబంధించిన ఆకృతుల విష‌యంలో ఏళ్ల‌కు ఏళ్లు గ‌డుస్తున్నా.. ఆయ‌న రాజీ ప‌డ‌డం లేదు. తాజాగా చంద్ర‌బాబు జ‌రిపిన లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో కేవ‌లం నార్మ‌న్ ఫోస్ట‌ర్ సంస్థ రూపొందించిన ఆకృతుల‌ను ప‌రిశీలించేందుకే కేటాయించారు. ఆయా ఆకృతులు త‌న‌కు ఎంత‌గానో న‌చ్చాయ‌ని విజ‌య‌వాడ వ‌చ్చిన ఆయ‌న శ‌నివారం వెల్ల‌డించారు. అంతేకాదు, అసెంబ్లీ నిర్మాణాన్ని తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను పరిష్కరించే వేదిక‌ - భ‌విష్య‌త్తులో ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా చర్చలు చేసే వేదిక అసెంబ్లీ అని అన్నారు.

ప్ర‌పంచంలో తెలుగువారు ఎక్క‌డున్నా వారంతా గ‌ర్వ‌ప‌డేలా అమ‌రావ‌తిలో అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మిస్తామ‌ని తెలిపారు. ప్ర‌పంచంలో మ‌న‌వాళ్లు ఎక్క‌డున్నా ఈ క‌ట్ట‌డాల‌ను చూస్తే, నా అసెంబ్లీ నా జ‌న్మ‌భూమి అన్న భావ‌న వారిలో రావాలని చ‌ంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. చ‌ట్టాలు చేసే వేదిక అద్భుతంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ప‌లు ఆకృతుల‌ను ప‌రిశీలించామ‌ని, 45 రోజుల్లో ఆకృతులను ఖ‌రారు చేస్తామ‌ని తెలిపారు. గ‌తంలో తాను ఐటీ మీద ఎక్కువ‌గా దృష్టి పెట్టేవాడిన‌ని, అయితే ఈసారి వ్య‌వ‌సాయ సాంకేతిక‌త‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో నూత‌న రాజ‌ధాని నిర్మాణం త‌న చేతుల మీదుగా జ‌ర‌గ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని అన్నారు. మొత్తానికి అసెంబ్లీ విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని బాబు వెల్ల‌డించారు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ అసెంబ్లీ నిర్మాణ ఆకృతుల‌పై ప‌డింది. మ‌రి ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే.. బాబు చెప్పిన‌ట్టు 45 రోజులు వెయిట్ చేయాల్సిందే!!