Begin typing your search above and press return to search.

ఈ నాన్చుడు ఇంకా ఎంత‌కాలం బాబు?

By:  Tupaki Desk   |   27 April 2018 4:27 AM GMT
ఈ నాన్చుడు ఇంకా ఎంత‌కాలం బాబు?
X
ఎంత బాబు అయితే మాత్రం అన్న‌ట్లుగా ఉంద‌ట ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ సీన్‌. ఉప్పు..నిప్పులా మారిన మంత్రి భూమా అఖిల‌ప్రియ.. ఏవీ సుబ్బారెడ్డి య‌వ్వారం ఓ ప‌ట్టాన తేల‌క‌పోవ‌టంపై బాబుకు బీపీ పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఒక‌ప్పుడు త‌న తండ్రికి అత్యంత స‌న్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి.. ప‌వ‌ర్ ను త‌మ ఫ్యామిలీ నుంచి తీసుకెళ్లిపోవాల‌న్న ప్ర‌య‌త్నం భూమా అఖిల‌ప్రియ‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేద‌ని చెబుతారు.

చిన్నపిల్ల‌లే క‌దా అని ఫీలైన ఏవీ సుబ్బారెడ్డికి.. మంత్రి అఖిల‌ప్రియ అండ్ కో తీరు ఏ మాత్రం మింగుడుప‌డ‌ని రీతిగా మారిందంటున్నారు. విష‌యం ఏమైనా అఖిల‌ప్రియ వ‌ర్సెస్ ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య పంచాయితీ మాత్రం ఒక ప‌ట్టాన క్లోజ్ అయ్యే అవ‌కాశం అస్స‌లు క‌నిపించ‌ట్లేదు.

అదే స‌మ‌యంలో కఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో బాబుకున్న అశ‌క్త‌త తెలిసిందే. పార్టీకి క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పే బాబు.. నేత‌ల మ‌ధ్య న‌డిచే అంత‌ర్గ‌త విభేదాల విష‌యంలో నాన్చుడి ధోర‌ణిని అనుస‌రించ‌టం మొద‌టి నుంచి ఉన్న‌దే. బాబు మాట‌ల్లో ఉండేంత ఎఫెక్ట్ చేత‌ల్లో ఉండ‌క‌పోవ‌టం ఎంతోకాలంగా జ‌రుగుతున్న‌దే. తాజాగా అలాంటి ప‌రిస్థితే మ‌రోసారి కంటిన్యూ అయ్యింది.

ఇటీవ‌ల ఏవీ సుబ్బారెడ్డి జ‌రిపిన సైకిల్ యాత్ర సంద‌ర్భంగా గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న యాత్ర‌పై రాళ్లు విస‌ర‌టం.. ఈ వ్య‌వ‌హారం వెనుక మంత్రి భూమా అఖిల‌ప్రియ ఉన్న‌ట్లుగా ఏవీ ఆరోపించ‌టం తెలిసిందే. వీరిద్ద‌రి మ‌ధ్య‌నున్న పంచాయితీ పార్టీకి ఎక్క‌డ న‌ష్టం వాటిల్లేలా చేస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆళ్ల‌గ‌డ్డలో నెల‌కొన్న విభేదాలు అధికార‌ప‌క్షం ఇమేజ్ ను దెబ్బ తీస్తున్న వేళ‌.. ఇందుకు కార‌ణ‌మైన భూమా అఖిల‌ను.. ఏవీ సుబ్బారెడ్డిల‌ను సీఎంవోకు పిలిపించారు.

త‌న సోద‌రి మౌనిక‌.. సోద‌రుడు బ‌హ్మానంద‌రెడ్డిని వెంట పెట్టుకొని మంత్రి అఖిల‌ప్రియ చంద్ర‌బాబుకు వ‌ద్ద‌కు రాగా.. త‌న ముఖ్యఅనుచ‌రుల‌తో ఏవీ సుబ్బారెడ్డి వ‌చ్చారు.వీరిద్ద‌రి ప‌ద్ద‌తి ఏ మాత్రం బాగోలేద‌ని.. ఇలాగే ఉంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని బాబు వారిపై మండిప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన త‌ర్వాత వీరి పంచాయితీ విష‌యాన్ని ప‌రిశీలించిన బాబు.. తొలుత వీరిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

అయితే.. త‌మ త‌ప్పేం లేన‌ట్లుగా ఎవ‌రికి వారు త‌మ వాద‌న‌ల్ని బాబు ముందు పెట్ట‌టంతో మ‌రింత ఇరిటేట్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. వీరిద్ద‌రి వ్య‌వ‌హారం తేల్చ‌టం అంత తేలికైన విష‌యం కాద‌న్నది గుర్తించిన బాబు.. ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం త‌న‌ను క‌ల‌వాల‌ని చెప్పారు.

ప్ర‌భుత్వంలో ఉండి.. అధికార యంత్రాంగం మొత్తం త‌న చెప్పు చేత‌ల్లో ఉన్న వేళ‌.. అఖిల‌.. ఏవీ సుబ్బారెడ్డిల్లో ఎవ‌రిది త‌ప్పు అన్న విష‌యంపై గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోవ‌టం బాబు స్థాయిలో పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ.. త‌న‌కు తెలిసిన విష‌యాన్ని ఇరువురు నేత‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పి.. తీరు మార్చుకోక‌పోతే తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న వైనాన్ని ఇరుప‌క్షాల వారికి అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంలో బాబు ఫెయిల్ అవుతున్న‌ట్లు చెబుతున్నారు. మాట‌ల‌తో ఎగ‌ర‌ట‌మే త‌ప్పించి.. వేటు వేసే విష‌యంలో బాబుకున్న ప‌రిమితులు ఇరువురు నేత‌ల‌కు తెలిసి ఉండ‌టంతో ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ ఒక కొలిక్కి రావ‌టం లేద‌న్న మాట వినిపిస్తుంది. మ‌రి.. ఈ రోజైనా ఆళ్ల‌గ‌డ్డ పంచాయితీ ఒక కొలిక్కి వ‌స్తుందేమో చూడాలి.