Begin typing your search above and press return to search.

బాబు జ‌మానా!...బీసీల‌కు అవ‌మానాలే న‌జ‌రానా!

By:  Tupaki Desk   |   1 Feb 2019 1:30 AM GMT
బాబు జ‌మానా!...బీసీల‌కు అవ‌మానాలే న‌జ‌రానా!
X
కేఈ కృష్ణ‌మూర్తి... టీడీపీలో సీనియ‌ర్ నేత‌. పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు స‌మ‌కాలీనుడు. చంద్ర‌బాబుతో క‌లిసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కేఈ.. ప్ర‌స్తుతం చంద్రబాబు కేబినెట్ లో చంద్ర‌బాబు త‌ర్వాతి ప్లేస్‌ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అంతేనా... కేబినెట్ లో కీల‌క‌మైన రెవెన్యూ మంత్రిత్వ శాఖ‌తో పాటుగా దేవాదాయ శాఖ బాధ్య‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక రాజ‌కీయ ప‌రంగా చూస్తే... రాయ‌ల‌సీమ‌లో బ‌ల‌మైన రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ప‌క్క‌కు తోసేసి... వారి కంటే బ‌ల‌మైన నేత‌గా ఎదిగిన బీసీ నేత‌గా కేఈ గుర్తింపు సంపాదించారు. క‌ర్నూలు జిల్లాలో కేఈకి ఉన్నంత ప‌ట్టు మ‌రే నేత‌కు లేద‌నే చెప్పాలి. మాజీ సీఎం కోట్ల విజ‌య భాస్క‌ర‌రెడ్డి నే ఢీకొట్టి... క‌ర్నూలు లోక్ స‌భ స్థానంలో ఆ దిగ్గ‌జాన్ని ఓడించిన నేత‌గా కూడా కేఈకి మంచి పేరే ఉంది. ఇది కేఈ కృష్ణ‌మూర్తికి సంబంధించిన ఇంట్ర‌డ‌క్ష‌న్ అయితే... ఇప్పుడు టీడీపీ జ‌మానా గురించి కూడా చెప్పుకోవాల్సిందే.

ఎందుకంటే... బీసీల‌కు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ, బీసీల‌ను రాజ‌కీయంగా అంతెత్తుకు ఎదిగేలా చేసిన పార్టీగా చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు... ఇటీవ‌లే జ‌య‌హో బీసీ పేరిట ఓ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఎన్నిక‌ల వేళ మాత్ర‌మే ఆయ‌న నోట నుంచి వినిపించే బీసీ మంత్రం ఇప్పుడు కూడా ఎన్నిక‌లు వ‌స్తుంద‌న‌ గానే వినిపించింది. బీసీల సంక్షేమం కోసం తాము చేసినంత‌గా మ‌రెవ్వరూ చేయ‌లేద‌ని చెప్పిన చంద్రబాబు... బీసీల సంక్షేమం ఇప్పుడే గుర్తుకు వ‌చ్చిన‌ట్లుగా వ‌రాల జ‌ల్లును కురిపించేశారు. బీసీలు రాజ‌కీయంగా ఎద‌గాలంటే... అందుకు టీడీపీనే మంచి వేదిక అని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఇలాగే కాపుల‌కు వ‌రాలు కురిపించిన బాబు.. ఆ ఎన్నిక‌ల్లో గెలిచి ఓ కాపు నేత‌తో పాటు మ‌రో బీసీ నేత‌కు త‌న త‌ర్వాతి స్థాన‌మైన డిప్యూటీ సీఎం పోస్టులు ఇచ్చారు. కాపు కోటా కింద తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప - బీసీ కోటాలో కేఈ కృష్ణ‌మూర్తి ఈ ప‌ద‌వుల‌ను చేప‌ట్టారు.

మ‌రి ఆ త‌ర్వాతి ప‌రిస్థితి ఏమిటంటే... ఏమీ లేదు. వారు పేరుకు మాత్ర‌మే మంత్రులు. వారికి కేటాయించిన కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ ఇత‌ర మంత్రులు - బాబును అనుకూలురు ప‌ర్య‌వేక్షించారు. చిన‌రాజ‌ప్పను ప‌క్క‌న‌పెడితే... కేఈకి ఇచ్చిన రెవెన్యూ శాఖ‌లో ఆయ‌న ఒట్టి ర‌బ్బ‌రు స్టాంపే. పేరుకే మంత్రి. ఆ శాఖ వ్య‌వ‌హారాల‌న్నీ దాదాపుగా చంద్ర‌బాబే ప‌ర్య‌వేక్షిస్తారు. వాస్త‌వంగా కొత్త రాజ‌ధానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ మొత్తం కేఈ చేతుల మీదుగానే జ‌ర‌గాలి. అయితే బాబు జ‌మానాలో... కేఈని ప‌క్క‌న‌పెట్టేసి...ఆ భూసేక‌ర‌ణ మొత్తాన్ని త‌న అనుంగు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌కు అప్ప‌గించేశారు. చివ‌ర‌కు ఆ శాఖ‌లో బ‌దిలీలు కూడా కేఈకి తెలిసి జ‌ర‌గ‌వు. రెవెన్యూ శాఖకు సంబంధించిన బ‌దిలీల‌న్నీ త‌న ఆధ్వ‌ర్యంలోనే జ‌ర‌గాల‌ని - లేదంటే ఇబ్బందేన‌ని బాబు హూంక‌రించేస్తారు. మొత్తంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న కేఈ... ఆ శాఖ‌లో ర‌బ్బ‌ర్‌కే ర‌బ్బ‌ర్ స్టాంప్‌. ఇక మొన్నామ‌ధ్య బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసిన స‌మ‌యంలో మ‌రో కీల‌క శాఖ అయిన దేవాదాయ శాఖ‌ను కూడా కేఈకి అప్ప‌గిస్తూ చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఆ శాఖకు సంబంధించి ఏ ఒక్క అధికారి గానీ - విభాగం గానీ కేఈ చేతి కింద లేదు. నేరుగా సీఎంకు చెప్పేయ‌డం... ప‌ని కానించేయ‌డం.. ఇదీ దేవాదాయ శాఖ తీరు.

అయితే సాధార‌ణ కార్య‌క్ర‌మాలు అయితే ఏమోలే అనుకోవ‌చ్చు గానీ... అమ‌రావ‌తిలో వెంక‌న్న ఆల‌య నిర్మాణానికి సంబంధించి కీల‌క ఘ‌ట్టం... ఆల‌య భూక‌ర్ష‌ణ నేటి ఉద‌యం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కేఈ అంతా తానై వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. అయితే ఆయ‌న‌కు టీడీపీ జ‌మానాలో ద‌క్కుతున్న ప్రాధాన్యాన్ని గ‌మ‌నించారో - ఏమో తెలియ‌దు గానీ... టీటీడీ అధికారులు అస‌లు కేఈకి ఆహ్వాన‌మే పంప‌లేద‌ట‌. దీంతో షాక్ తిన్న కేఈ... ఏకంగా అల‌కబూనారు. ఎంత సీనియ‌ర్‌ - ఓపిక ఉన్న నేత‌కు అయినా శృతి మించితే కోపం స‌హ‌జ‌మే క‌దా. తాను నిర్వ‌హిస్తున్న శాఖ‌కు సంబంధించిన కీల‌క కార్య‌క్ర‌మానికి త‌న‌కే ఆహ్వానం లేక‌పోతే.. అంత‌కంటే చెప్పేదేముంది. అందుకే కేఈకి కోపం వ‌చ్చేసింది. కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌ర‌య్యారు. ఈ వ్యవ‌హారం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మొత్తంగా ఈ చ‌ర్య ద్వారా టీడీపీ జ‌మానాలో బీసీల‌కు - బీసీ నేత‌ల‌కు ఏమాత్రం ప్రాధాన్యం ద‌క్కుతుంద‌న్న విష‌యాన్ని తేల్చి చెప్పేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.